విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

  • Published - 01:37 PM, Tue - 4 February 20
విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా

గతవారం అమరావతిలో ఉన్నన్యాయపరిపాలనకు సంబందించిన విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ మరియు సభ్యుల కార్యాలయాలని వెలగపూడి నుండి కర్నూలుకు తరలిస్తూ జనవరి 31 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీచేసింది. ఈ నేపథ్యంలో తాళ్లయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమావారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు.

కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విజిలెన్స్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాల తరలింపుపై విచారణ రేపటికి వాయిదా వేసింది. కాగా, విజిలెన్స్ కార్యాలయాలు రాజధానిలో అంతర్భాగమేనని, కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రభుత్వం సదరు కార్యాలయాలను అమరావతి నుంచి కర్నూలుకు తరలించారని పిటిషనర్ ఆరోపించారు. సీఆర్డీఏ చట్టంలో జస్టిస్ సిటీతో కలిపి ఏడు సిటీలు నోటిఫై చేశారని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే తాము పాలనా సౌలభ్యం కోసమే కార్యాలయాలు తరలించామని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. విజిలెన్స్ కమిషన్ ఆఫీస్ పలానా చోట ఉండాలని ఎక్కడా లేదన్నారు. సచివాలయంలో శాశ్వత ప్రాతిపదికన విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం లేదని ఏజీ కోర్ట్ కి వెల్లడించారు. తమకి తగిన సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతామని ఏజీ కోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

అయితే ఈ రోజు మధ్యాహ్నం నుండి కొన్ని ఛానెల్స్ లో, ఒక వర్గం సోషల్ మీడియాలో మీడియాలో విజిలన్స్ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన్నట్టు, కార్యాలయాల తరలింపుని తప్పుబడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించినట్టు, ప్రభుత్వం జారీ చేసిన జీవో లపై స్టే విధించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఐతే హైకోర్టు ఈరోజు సాయంత్రం కేసుపై తదుపరి విచారణని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

Show comments