iDreamPost
iDreamPost
ప్రపంచం విపత్తులో విలవిల్లాడుతోంది. హెరిటేజ్ మాత్రం లాభాల కోసం వెంపర్లాడుతోంది. లాక్ డౌన్ సమయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు. సామాన్యుడి మీద భారం వేసేందుకు వెనకాడడం లేదు. గత మూడు నెలల కాలంలో ఏకంగా రెండు సార్లు ధరలు పెంచడం దానికో నిదర్శనం. తాజాగా మరో సారి హెరిటేజ్ ప్రొడక్స్ట్ ధరలు పెంచిన తీరు మీద అంతా పెదవి విరుస్తున్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో సామాన్యులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇక్కట్లలో ఉన్నారు. ప్రభుత్వాలు , స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న చేయూతతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచకూడదని ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. అది ప్రజలకు మరింత భారం అయ్యి, బతుకు సాగించడం కష్టంగా మారుతుందనే ఉద్దేశంతో వ్యాపారులను కట్టడి చేసేందుకు, అక్రమాలు అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
అలాంటి సమయంలో హెరిటేజ్ టెట్రా పాల ప్యాకెట్ ధరలు అమాంతంగా పెంచడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు కుటుంబీకులు నడుపుతున్న సంస్థ లాభాల వేటకు తార్కాణంగా మిగులుతోంది. ఓవైపు చంద్రబాబు రాజకీయంగా చాలా ఉదారంగా ఉన్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా సమయంలో కూడా రాజకీయాలకు కరువు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆయన భార్య , కోడలు సారధులుగా ఉన్న హెరిటేజ్ కూడా తమ లాభాలకు కొదవ రాకుండా చూసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.
ఓవైపు హెరిటేజ్ కి పాలు అందిస్తున్న రైతులకు న్యాయం చేయకుండానే మరోవైపు రీటైల్ వినియోగదారులపై భారం వేయడం విడ్డూరంగా మారింది. మాటలకు చేతలకు పొంతన లేని నారా వారి తీరుకి కొనసాగింపుగా హెరిటేజ్ వడ్డన ఉందని కొందరు విమర్శిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో ఏకంగా టెట్రా మిల్క్ ప్యాకేట్ పై రెండు రూపాయల ధర పెంచడం దారుణం అంటున్నారు. జనవరిలో, మార్చిలో వరుసగా ధరలు పెంచడం హెరిటేజ్ సంస్థ లాభాల వేటలో దేనికైనా సిద్ధపడుతుందనే విమర్శలకు అవకాశం ఇస్తోంది. ఇప్పటికైనా చంద్రబాబు కుటుంబం పునరాలోచన చేయడం మంచిదేమో అనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి.