కెసిఆర్ కోరిన హెలికాప్టర్ మనీ మంచిదా లేక క్వాంటిటేటీవ్ ఈజింగ్ మంచిదా?

దేశంలో మార్చి 25 నుండి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వలన రైతులు,వలస కూలీలు,తోపుడు బండ్లవారు,చిరు వ్యాపారులు చిల్లర దుకాణదారులు,భవన నిర్మాణ కార్మికులు వంటి అసంఘటిత రంగ కార్మికులు పెద్దఎత్తున ఉపాధి కోల్పోతున్నారు. దినసరి సంపాదన మీద ఆధారపడిన వారి కొనుగోలు శక్తి అమాంతం పడిపోయింది.

దీంతోపాటు వ్యవసాయ,పారిశ్రామిక మరియు సేవ రంగాలలో ఉత్పత్తి నిలిచి పోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలోకి నెట్టబడింది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 నుండి 2.8 శాతం మాత్రమే ఉండవచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా కట్టింది.ఈ పరిస్థితుల నుండి భారత ఆర్థిక వ్యవస్థ గట్టెకాలంటే ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలైన హెలికాఫ్టర్ మనీ లేదా క్వాంటిటేటీవ్ ఈజింగ్ (Quantitative Easing) అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి రాసిన లేఖలో మన దేశ GDPలో 5 శాతం హెలికాఫ్టర్ మనీ అవసరమని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ మనీ అంటే హెలికాప్టర్‌లో మనీ తెచ్చి పూల వర్షం లాగా చల్లడం వంటిది అన్నమాట.అంటే భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ముద్రించి ప్రజలకు ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు ఉచితంగా అందజేసి తద్వారా వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను దివాలా తీయకుండా కాపాడటం.

ఆర్థిక మాంద్య పరిస్థితులలో ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచేవిదంగా నిధులు విడుదల చేయాలనే ఆలోచన నేటిది కాదు.1929 – 1939 నాటి ఆర్థిక మాంద్యకాలంలో ప్రముఖ ఆర్థికవేత్త కీన్స్ ప్రజలకు ప్రభుత్వాలు విరివిగా పని కల్పించి డబ్బులు అందించాలని,ఏ పని లేకపోతే గుంతలు తవ్వించి పూడిపించాలని అందుకు కూలి ఇవ్వాలని పేర్కొన్నారు.

భారతదేశంలో కరెన్సీ ముద్రణ చేసే ఆర్‌బీఐ తన వద్ద ఉన్నా బంగారు నిల్వలు మరియు దేశంలో వస్తు సేవల ఉత్పత్తి ఆధారంగా నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొస్తుంది.అయితే హెలికాఫ్టర్ మనీ కోసం ఇబ్బడిముబ్బడిగా కరెన్సీని ముద్రిస్తే తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదముంది.

ఇక క్వాంటిటేటీవ్ ఈజింగ్ అంటే RBI ప్రభుత్వం దగ్గర బాండ్లు కొని డబ్బులు ఇవ్వడం.1976లో అర్ధ శాస్రంలో నోబెల్ బహుమతి పొందిన అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్‌ హెలికాఫ్టర్ మనీ అనే భావనను తన consumption analysis monetory history and theory,the complexity stabilization policy లో పేర్కొన్నారు.2002లో ఈ ఆర్థిక విధానానికి ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ బెన్‌ బెర్నాంకే ప్రాచుర్యంలోకి తెచ్చారు.

కేసీఆర్ చెప్పినట్లు GDP లో 5 శాతం హెలికాఫ్టర్ మనీ పథకాన్ని అమలు చేస్తే జింబాబ్వే లాంటి ఆఫ్రికన్ దేశాలలో మాదిరి ద్రవ్యోల్బణం నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.గతంలో హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమెరికా,జపాన్‌ వంటి దేశాలు అవలంబించాయి. కానీ ఈ విధానాన్ని అవలంబించిన ఆయాదేశాలలో అది దుష్ఫలితాలు ఇచ్చింది.సింగల్ టీ కొనటానికి ప్రజలు బస్తా నిండా డబ్బులు తీసుకెళ్లవలసి వొచ్చింది.

అలా కాకుండా క్వాంటిటేటీవ్ ఈజింగ్ అయితే కొంత మేలు. ఆర్‌బీఐ ప్రభుత్వాల దగ్గర బాండ్లు కొని ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహద పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.అలాగే RBI గుణాత్మక చర్యగా CRR ను తగ్గించి బ్యాంకుల దగ్గర నగదు నిల్వలు పెంచి ప్రజలకు తక్కువ వడ్డీకి చిన్న మొత్తాలను రుణాలుగా ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు.

Written by  P.Venkateswarlu,Teacher

Show comments