iDreamPost
android-app
ios-app

నాడు టీడీపీ ప్రాయోజిత ఉక్కు ఉద్యమం – నేడు నేరుగా టీడీపీ బాధ్యతలు

నాడు టీడీపీ ప్రాయోజిత ఉక్కు ఉద్యమం – నేడు నేరుగా టీడీపీ బాధ్యతలు

ఉద్యమాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం.. తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకున్న తర్వాత ఉద్యమ ముసుగులు తొలగించడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. కడప ఉక్కు పరిశ్రమ కోసమంటూ రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లపాటు వైఎస్సార్‌ జిల్లాలో హడావుడి చేసిన స్టీల్  ప్లాంట్‌ సాధన సమితి అధ్యక్షుడు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అలియాజ్‌ ఉక్కు ప్రవీణ్‌కు తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ బాధ్యతలు దక్కాయి.

ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యమంటూ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు, సభలు, దీక్షలు, సమావేశాలతో యువతలో ఫాలోయింగ్‌ పెంచుకున్న ప్రవీణ్‌.. స్థానిక తెలుగుదేశం నేతలతో, ముఖ్యంగా అప్పటి టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో మంచి సంబంధాలు కొనసాగించేవారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎన్నికల ముందర టీడీపీ చేసిన దొంగ దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆ క్రమంలోనే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాజకీయ భవిష్యత్‌పై చంద్రబాబు ఇచ్చిన హామీతో గతేడాది టీడీపీలో చేరారు. దీనిపై ఉద్యమకారుల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే జమ్మలమడుగు నియోజకర్గంలోని మైలవరం మండలం కంబాల దిన్నె వద్ద చంద్రబాబు శంకుస్థాపన చేశారు కాబట్టి తాను ఆ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. కాగా, ఈయన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తమ్ముడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు కావడం గమనార్హం.

ఆ ఇద్దరి సీనియర్ల రాజకీయ జీవితం అగమ్య గోచరం..
ప్రొద్దుటూరు టీడీపీ బాధ్యతలు ప్రవీణ్‌కు అప్పచెప్పడంతో సీనియర్‌ నేతలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డిల రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్‌ కోసం గత ఎన్నికల్లో వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య తీవ్ర పోరు నడిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వరదరాజులరెడ్డి.. వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన తన శిష్యుడు రాచమల్లు ప్రసాదరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనే టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగుతూ వచ్చారు.

అయితే 2019 ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి లింగారెడ్డి తనకే టికెట్‌ కావాలని భీష్మించుకు కూర్చున్నారు. ఈ వివాదం చాలా రోజులు నడిచింది. చంద్రబాబు వద్ద పంచాయతీ జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. ఒకానొక సమయంలో డబ్బున్న బీసీలు ముందువస్తే తాను టికెట్‌ ఇప్పిస్తానంటూ వరదరాజులరెడ్డి ప్రకటన చేశారు. దీంతో బొర్రా రామాంజనేయులతోపాటు మరికొందరు బీసీలు ముందుకు వచ్చారు. అయితే ఆ ప్రతిపాదనా ముందుకు సాగలేదు. చివరికి అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్‌ మంత్రాంగంతో లింగారెడ్డికి టికెట్‌ వచ్చేలా చేశారు.

అప్పట్లో ఆది, రమేశ్‌ తీవ్ర విమర్శలు చేసిన వరదరాజులరెడ్డి ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదు. ఎన్నికల్లో లింగారెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రొద్దుటూరు టీడీపీ బాధ్యతలు మోసిన లింగారెడ్డి క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. టీవీ టిబేట్లలో టీడీపీ తరఫున అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ స్థానికంగా చురుగ్గా ఉండడంలేదు. ఈ క్రమంలోనే ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ప్రొద్దుటూరు ఇంచార్జి బాధ్యతలు అప్పజెపుతూ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అటు వరదరాజులరెడ్డి వర్గీయులు, ఇటు లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.