iDreamPost
android-app
ios-app

గులాబో సితాబో – ఒక క్లాసిక్

గులాబో సితాబో – ఒక క్లాసిక్

ఇల్లు ఒక వ్య‌స‌నం, సెంటిమెంట్‌, కాంక్ష‌, ఆశ‌. ఇల్లు అమ్ముతున్న‌ప్పుడు ఎందుకు ఏడుస్తారంటే ఆస్తిని అమ్ముకున్నందుకు మాత్ర‌మే కాదు. ఆ ఇంటితో ముడిప‌డిన జ్ఞాప‌కాల‌ను, క‌ల‌ల్ని కూడా అమ్ముతున్నందుకు.

మా ఊళ్లో ఒక బంగ‌ళా ఉండేది. ఆ ఇంటాయ‌న ఆఖ‌రి కొడుకు నా క్లాస్‌మేట్‌. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ లేవు కాబ‌ట్టి వాడు నా క్లాస్‌మేట్ అయ్యాడు. లేదంటే వాడిది ప‌బ్లిక్ స్కూల్ స్థాయి, నాది మున్సిప‌ల్ స్కూల్ స్థాయి. ఆ బంగ‌ళాలోకి ఎంట‌ర్ అవుతున్న‌ప్పుడే కొంచెం భ‌య‌మేసేది. పూల మొక్క‌ల మ‌ధ్య కొంచెం దూరం న‌డిచిన త‌ర్వాత ఒక కారు, గుర్ర‌బ్బండి క‌నిపించేది. అక్క‌డ ఒక పెద్దాయ‌న సింహాస‌నం లాంటి కుర్చీలో కూచుని “ఎవ‌డ్రా నువ్వు” అని అరిచేవాడు. ఆ ఇంటి కుక్క కంటే , ఆయ‌న్ని చూసే ఎక్కువ భ‌య‌ప‌డేవాన్ని. ఆయ‌న భ‌యం వ‌ల్ల కొడుకులంతా అప్ర‌యోజ‌కుల‌య్యారు. ఆయ‌న పోయాడు. బంగ‌ళా కూడా పోయింది. పాత బంగ‌ళాని కూల్చేశారు. ఆ బంగ‌ళాతో ఎంతోకొంత నా బాల్యం ముడిప‌డి ఉంది. నాకే బాధ క‌లిగితే , ఆ ఇంట్లో వాళ్లు ఇంకా బాధ‌ప‌డి ఉంటారు.

అలాంటి బంగ‌ళా క‌థే సుజిత్ స‌ర్కార్ ద‌ర్శ‌క‌త్వంలో అమితాబ్‌, ఆయుష్మాన్ ఖురానాలు న‌టించిన గులాబో సితాబో సినిమా. ఒక హ‌వేలీ ఆత్మ‌ని ఆవిష్క‌రించ‌డ‌మే దీని ఉద్దేశం. కొన్ని హ‌వేలీల్లో ప్రేతాత్మ‌లు కూడా ఉంటాయి. ఇక్క‌డ బ‌తికే ప్రేతాత్మ మీర్జా (అమితాబ్‌) హ‌వేలీని త‌న ఆత్మ‌గా భావించే ఫాతీమాబేగం. వీళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే క‌థే సినిమా.

గులాబో సితాబో పేరుకి , ఈ సినిమాకి ఏ సంబంధం లేదు. ల‌క్నోలో జ‌రిగే తోలుబొమ్మ‌లాట‌లో (మ‌న బంగార‌క్క‌, కేతిగాడులా) గులాబో ఒక బొమ్మ పేరు. ఇంకో బొమ్మ పేరు సితాబో.

బ‌ల‌వంతంగా మ‌న నుదుట మ‌న‌మే పేద‌రికాన్ని రాసుకుంటే దాని పేరు పిసినారిత‌నం. చిన్న‌ప్పుడు రెండో త‌ర‌గ‌తిలో “పిసినారి ముస‌లి ఒక‌డు ప‌సిడిదాచే” అనే పాఠం ఉండేది. అప్ప‌టి నుంచి పిసినారిగా జీవించే వాళ్ల‌ని చూస్తే జాలి. పిసినారుల గొప్ప‌త‌నం ఏమంటే, ఆ విష‌యం వాళ్ల‌కి తెలియ‌దు. ఎదుటి వాళ్లే పిసినారులని అనుకుంటూ ఉంటారు. అమితాబ్ పెద్ద ముక్కుతో , తెల్ల‌టి గ‌డ్డంతో యాక్ట్ చేసిన ఈ సినిమాలో ఆయ‌న పెద్ద పిసినారి. ఆ మేక‌ప్‌లో మ‌నం అమితాబ్‌ని గుర్తు ప‌ట్ట‌లేక పోవ‌చ్చు. మీర్జాని మాత్రం మ‌రిచిపోలేం. అదే అమితాబ్ గొప్ప‌త‌నం. ఆయ‌న్ని మ‌రిచి, మీర్జాని గుర్తు పెట్టుకుంటాం.

నేను తిరుప‌తిలో ఉన్న‌ప్పుడు తీర్థ‌క‌ట్ట వీధిలో ఒక పురోహితుడు ఉండేవాడు. ఆయ‌న దుకాణాల వాళ్ల‌ని ఆశీర్వ‌దించి ఐదో ప‌దో తీసుకునేవాడు. ఒక రోజు చ‌నిపోయాడు. ఆయ‌న‌కి ఎవ‌రూ లేరు. పోలీసులు వ‌చ్చి శ‌వాన్ని బ‌య‌టికి తీసి, ఇల్లు చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఓ వంద గొడుగులు, 200 పంచెలు, గుట్ట‌లుగుట్ట‌లుగా కొత్త ట‌వ‌ళ్లు (దానంగా తీసుకున్న‌వి) , ఓ 50 స్టీల్ చెంబులు. చిన్న‌చిన్న గుడ్డ‌ల్లో భ‌ద్రంగా క‌ట్టి పెట్టిన చిల్ల‌ర నాణాలు, నోట్లు. బ్యాంక్ పాస్ బుక్స్‌. ఆయ‌న‌కి తీసుకోవ‌డం త‌ప్ప ఇవ్వ‌డం తెలియ‌దు. ఆ డ‌బ్బుతో న‌లుగురైదుగురు పేద పిల్ల‌ల్ని ఈజీగా చ‌దివించొచ్చు. పిసినారి త‌నం ఆవ‌రించిన వాడు, త‌న అంత్య‌క్రియ‌ల‌కి కూడా పొదుపు చేయాల‌నుకుంటాడు. ఖురాన్‌లో ఒక సూక్తి ఉంది. “నీ చేయిని పొడుగ్గా చాచ‌క‌పోతే (దానం) అది నీ నోటి వ‌ర‌కూ కూడా రాదు జాగ్ర‌త్త” అని. మీర్జా అలాంటి వాడే. తీసుకోవ‌డ‌మే త‌ప్ప ఇవ్వ‌డం తెలియ‌దు.

మీర్జా భార్య ఫాతీమాబేగం (ఫ‌రూక్ జఫ‌ర్, సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌లో ముస‌ల‌మ్మ గుర్తుందా?) ఆమె పేరుతో హ‌వేలీ. అది ఎంత పెద్ద‌దంటే విశాలమైన స్థ‌లం. ఓ ఆరేడు కుటుంబాలు అద్దెకుంటాయి. మేక‌లు కూడా తిరుగుతుంటాయి. బేగం చ‌నిపోతే మ‌హ‌ల్ మీర్జా సొంత‌మ‌వుతుంది. కానీ బేగం ఎంత కాలానికీ చ‌నిపోదు. వ‌య‌స్సు 95. మీర్జా వ‌య‌స్సు 78.

ఆయుష్మాన్ ఖురానాది ఒక ర‌కంగా సైడ్ రోల్‌. హీరో అమితాబే. హ‌వేలీలో ఒక ఇంట్లో త‌ల్లి, ముగ్గురు చెల్లెళ్ల‌తో ఆయుష్మాన్ అద్దెకి ఉంటాడు. కానీ అద్దె ఎగ్గొడుతూ మీర్జాని తిడుతూ ఉంటాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. పిండిమిష‌న్ న‌డిపే వాడితో జీవితం ఎలా ఉంటుందోన‌ని భ‌య‌ప‌డి ఆ అమ్మాయి నిర్ణ‌యం మార్చుకుంటుంది.

పాన్ మ‌ర‌క‌ల‌తో , పెచ్చులూడిపోయి , ఇటుక‌లు తేలిన హ‌వేలీలో పేద‌రిక విధ్వంసం క‌నిపిస్తూ ఉంటుంది. లెట్రిన్‌ని కూడా షేర్ చేసుకోవ‌ల‌సిన స్థితి. టాయిలెట్లో కూచున్న వాడు ఎంత‌కీ రాక‌పోతే ఆయుష్మా ఒక త‌న్ను తంతే గోడ ప‌డిపోతుంది. క‌థ పోలీస్ స్టేష‌న్ చేరుతుంది. ఇక్క‌డ్నుంచి పురావ‌స్తుశాఖ‌కి.

ఈ హ‌వేలీని ఆర్కియాల‌జీలో క‌లిపేయాల‌ని ఒక అధికారి ప్లాన్ చేస్తాడు. దాంతో భ‌య‌ప‌డిన మీర్జా లాయ‌ర్‌ని క‌లుస్తాడు. అత‌ను ఈ హ‌వేలీని బిల్డ‌ర్‌కి అమ్మాల‌ని పథ‌కం వేస్తాడు. కిరాయిదారులు వాళ్ల ఎత్తుగ‌డ‌లు వాళ్లు వేస్తారు.

ఈ క‌థ ప్ర‌త్యేక‌త ఏమంటే ఉదాత్త‌మైన పాత్ర‌లంటూ ఉండ‌వు. బేగం చ‌చ్చిపోతుంద‌ని ఎదురు చూసే మీర్జా. కిరాయి ఇవ్వ‌ని ఆయుష్మాన్‌. ఉద్యోగం కోసం వ్య‌భిచారానికి కూడా సిద్ధ‌మైన అత‌ని చెల్లి. న‌క్క‌జిత్తుల లాయ‌ర్‌, ఆర్కియాల‌జీ అధికారి.

ఈ సినిమా అమెజాన్‌లో రావ‌డ‌మే మంచిదైంది. థియేట‌ర్‌లో వ‌స్తే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చేది. అమితాబ్‌, ఆయుష్మాన్ అంటే అంచ‌నాల‌తో వ‌చ్చి నిరాశ ప‌డేవాళ్లు. సుజిత్ స‌ర్కార్‌కి ఉన్న పేరు కూడా (వికి డోన‌ర్‌, పీరూ) త‌క్కువేం కాదు.

అయితే ఇది క్లాసిక్‌. డైలాగ్‌లు క‌రెక్ట్‌గా ఫాలో అయితే అద్భుత‌మైన హాస్యం ఉంది. విషాదం ఉంది. క‌థ‌లో ఉత్కంఠ లేక‌పోవ‌డం మైన‌స్‌. ఇది ఒక పిసినారి ముస‌లి వాడి క‌థ‌. సంప‌ద అంటే ఆశ‌. దాని విలువ కూడా తెలియ‌ని మూర్ఖుడు. పురాత‌న షాండ్లియార్‌ని వెయ్యి రూపాయ‌ల‌కి అమ్ముకుంటాడు. బేగం ప్రేమ‌గా కుర్చీని కానుక‌గా ఇస్తే రూ.250కి అమ్మేస్తాడు. దాన్ని షోరూంలో రూ.1.35 ల‌క్ష‌ల‌కు అమ్ముతారు. అత‌ను ఎంత నికృష్టుడంటే హ‌వేలీలోని బ‌ల్బుల‌ను కూడా దొంగ‌లిస్తాడు. క‌ఫ‌న్‌ని (శవం మీద క‌ప్పే గుడ్డ‌) కూడా బేరమాడుతాడు.

అంతా త‌న‌కే కావాల‌నుకున్న మీర్జాకి చివ‌రికి ఏమీ ద‌క్క‌దు. ఇది నారికేళ పాకం. ఓపిక‌తో చూస్తే త‌ప్ప మాధుర్యం అర్థం కాదు. ఇది ద‌ర్శ‌కుడి గొప్ప‌త‌నం, ఓట‌మి కూడా.

అమితాబ్ కాలంలో మ‌నం కూడా జీవించి ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డాలి. ఇంత‌కు మించి ఏం చెబుతాం?