iDreamPost
iDreamPost
ఏపీలో అధికార పక్షం వ్యూహాలకు పదును పెట్టింది. ప్రతిపక్షాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. మండలిలో సెలక్ట్ కమిటీతో చెక్ పెట్టాలని ఆశించిన విపక్ష టీడీపీకి ఎదురుదెబ్బ కొట్టేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా సెలక్ట్ కమిటీ ప్రతిపాదన తోసిపుచ్చింది. 14 రోజుల నిబంధనను ముందుకు తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందినట్టేనని పేర్కొంటోంది. ఈపరిణామంతో ప్రతిపక్షాలకు ఝలక్ ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో పాలనా వికేంద్రీకరణ, రాజధాని బిల్లులు పెద్ద స్థాయిలో రగడకు దారితీశాయి. చివరకు మండలి రద్దు వరకూ తీసుకెళ్లాయి. ముఖ్యంగా శాసనమండలిలో బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు కలకలం రేపాయి. వాస్తవానికి ఈ బిల్లు జనవరి 21న తొలుత అసెంబ్లీ ఆమోదించింది. అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. ఆ సందర్భంగా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పలు నిబంధనలను ప్రస్తావించారు. దాంతో చివరకు చివరకు చైర్మన్ జోక్యం చేసుకున్నారు.. నిబంధనలు సహకరించకపోయినా తనకున్న విచక్షణాధికారంతో బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అప్పటి వరకూ ధీమాగా కనిపించిన ప్రభుత్వం ఖంగుతినాల్సి వచ్చింది. దాంతో వెంటనే కోలుకుని మండలి రద్దు వ్యవహారాన్ని ముందుకు తెచ్చి, తన వంతు ప్రక్రియను పూర్తి చేసి కేంద్రానికి పంపించింది.
అయితే పార్లమెంట్ లో దానికి ఆమోదం దక్కి, రాష్ట్రపతి ముద్ర పడే వరకూ మండలి మనుగడలో ఉంటుంది కాబట్టి ఈలోగా సెలక్ట్ కమిటీ సహాయంతో ప్రభుత్వానికి ఆటంకం సృష్టించాలనే ఆలోచన ప్రతిపక్ష టీడీపీ చేసింది. కానీ నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం కొనసాగింది.
ఇప్పటికే 14 రోజుల్లోగా బిల్లుని ఆమోదించడం లేదా, సెలక్ట్ కమిటీకి పంపించడం వంటి ప్రక్రియలు పూర్తి చేయకపోవడంతో ఆ బిల్లు సాంకేతికంగా ఆమోదం పొందినట్టేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన వాదనను మీడియకు తెలిపారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఎంపిక జరగలేదని, అయినా 14 రోజుల్లోగా అది పూర్తి కాకపోవడంతో ఇక బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రకటించారు. దాంతో రేపటి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. సెలక్ట్ కమిటీ కి పంపిస్తున్నట్టు ప్రకటించి ఇప్పటికే 19 రోజులు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేస్తూ రాజధాని అంశంలో కీలకమైన ప్రకటన చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలు విపక్ష టీడీపీకి మింగుడుపడే అవకాశం లేదని భావిస్తున్నారు.