Idream media
Idream media
ఈ నెల 23వ తేదీన వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రారంభించి, 2.36 లక్షల మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చింది. కాపుల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పేద మహిళలకు ఏడాదికి 15 వేల చొప్పన 5 ఏళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రంలోని కాపు, తెలగ, ఒంటరి, బలిజ సామాజిక వర్గాల్లోని మహిళలు ఈ పథకానికి అర్హులు. వాలంటీర్ల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అర్హతలు పరిశీలించి ఆపై పథకం అమలు చేసింది. లబ్ధిదారులు జాబితాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీస్ బోర్టులో ఉంచింది.
ఎప్పటిలాగే అన్ని పథకాలపై విమర్శలు చేసినట్లే టీడీపీ నేతలు వైఎస్సార్ కాపు నేస్తం పథకంపై కూడా విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాపు మహిళలు 2.36 లక్షలేనా అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నించగా.. 50 లక్షల మంది కాపు మహిళలు ఉండగా వైసీపీ ప్రభుత్వం 2.36 లక్షల మందికే వైఎస్సార్ కాపు నేస్తం పథకం అందించిందంటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు.
ఇతర పథకాలకు ఇచ్చిన మాదిరిగానే వైఎస్సార్ కాపు నేస్తం పథకం కోసం కూడా అర్హులెవరైనా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సమయం ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకం ప్రారంభం తర్వాత కూడా దరఖాస్తుకు అవకాశం ఇస్తోంది. ఇంటి స్థలం, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ నేతన్న హస్తం.. ఇలా ప్రతి పథకంలోనూ మరోసారి దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అర్హులందరికీ వర్తించలేదని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ నేతలు బొండా ఉమా, నిమ్మల రామానాయుడులకు ఇదో సువర్ణావకాశం. అర్హత ఉండీ, పథకం అందని పేదలైన కాపుల్లోని 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ నేతలు పని చేయాలి. దరఖాస్తులు నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయవచ్చు కాబట్టి అర్హులైన వారు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో లేదా వాలంటీర్లను సంప్రదించాలని టీడీపీ నేతలు ప్రకటన ఇవ్వడం ద్వారా కాపులకు మేలు చేసిన వారు అవుతారు. లేదంటే టీడీపీ కార్యకర్తల ద్వారా అర్హులైన కాపు మహిళలతో దరఖాస్తు చేయిస్తే ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. మరి ఈ బాధ్యత కాపు నేత అయిన బొండా ఉమా చేస్తారా..?
టీడీపీ ప్రభుత్వ హయంలో మాదిరిగా జన్మభూమి కమిటీ సిఫార్సులు వైసీపీ ప్రభుత్వంలో అవసరం లేదు. కాబట్టి టీడీపీ నేతల గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా ప్రభుత్వ పథకాలు పొందవచ్చు.