Idream media
Idream media
జర్నలిజం ఒక క్రూరమైన ఆట. ఇది ఏదో రకంగా జర్నలిస్ట్‌లను బలి తీసుకుంటుంది, ఆర్థికంగా , కొన్నిసార్లు భౌతికంగా. ముంబయ్‌లో అనేక మంది జర్నలిస్టులకి కరోనా సోకింది. వాళ్లకి ఏమైనా జరిగితే , ఈ నాయకులు, యాజమాన్యాలు బాధ్యత తీసుకోవు. అనాథలా వెళ్లిపోవాల్సిందే. జీవితానికి , జీవనోపాధికి మధ్య కరోనా ఉంది. ఎటు వైపు ఉన్నా ప్రమాదమే. హక్కులు, చట్టాలు అన్నీ పుస్తకాల్లో ఉంటాయి. పత్రికల్లో ఉంటాయి. పత్రికా కార్యాలయాల్లో కాదు.
1988లో నేను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఈ వృత్తిలోని క్రూరత్వం , అమానవీయత అర్థమైంది. తిరుపతి బస్టాండ్‌లో బస్సుకు మంటలు అంటుకున్నాయి. అనేక మంది సజీవ దహనమయ్యారు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్నాను. రాత్రి 11 గంటలకి ల్యాండ్ ఫోన్ మోగింది. ఎత్తాను, అవతల రిపోర్టర్ రవికుమార్ గొంతు. సంఘటన ఒక వాక్యంలో చెప్పి పూర్తి వివరాలు కాసేపట్లో వస్తాయని , విషయం షిప్ట్ ఇన్‌చార్జ్‌కి చెప్పమని పెట్టేశాడు.
ఆ దృశ్యం తలచుకుంటేనే నాలో వణుకు, కాలిపోతున్న వాళ్ల హాహాకారాలు చెవుల్లో వినిపిస్తున్నాయి. చాలా బాధగా వెళ్లి ఇన్‌చార్జ్‌కి విషయం చెప్పాను. ఆయన ఏ ఫీలింగ్ లేకుండా విని “అబ్బా, ఇప్పుడు ఫస్ట్ పేజీ మార్చాలా?” అన్నాడు. నేను కొత్త కాబట్టి ఎమోషన్ అయ్యాను. ఆయన సీనియర్ కాబట్టి పని గురించి ఆలోచించాడు. చావు బతుకుల మధ్య ఉన్న ప్రముఖుల గురించి ముందే వార్తలు రాసుకోవడం ఆ రోజుల్లో ఒక పద్ధతి. ప్రముఖ నటుడు రాజ్‌కపూర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన చనిపోక ముందే న్యూస్ రెడీ అయింది. అది చూసి నేను రాజ్‌కపూర్ పోయాడనుకుని బాధపడుతూ హడావుడి చేశాను.
మా ఇన్‌చార్జ్ పిలిచి “ఇంకా ఆయన పోలేదు. పోతే అప్పటికప్పుడు రాసుకోలేం కాబట్టి ముందే న్యూస్ రెడీ అయింది” అని చెప్పాడు. దాదాపు 15 రోజులు అర్ధరాత్రి వరకూ రాజ్‌కపూర్ పోతాడని ఎదురు చూశాము.”ఈయన గ్యారెంటీగా ఎడిషన్ అయిపోయాకే పోతాడు” అని ఇన్‌చార్జ్ అనేవాడు. అలాగే పోయాడు.ఈ వృత్తి మనలోని సెన్సిటివ్‌నెస్‌ని పోగొడుతుంది.
తిరుపతిలో సుబ్రమణ్యం అని ఫొటోగ్రాఫర్ ఉన్నాడు. ఒకసారి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే అతనితో కలిసి వెళ్లాను. హోటల్ రూంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. పురుగుల మందు తాగి చనిపోయారు. మరణానికి ముందు చాలా బాధని అనుభవించినట్టున్నారు. పిల్లల్ని చూస్తే కడుపులో తిప్పేసింది. సుబ్బు చకచక ఫొటోలు తీస్తున్నాడు. హైలీ ప్రొఫెషనల్. సంఘటన అతన్ని బాధించదు. ఫొటో సరిగా వచ్చిందా లేదా అదే ముఖ్యం. ఒకసారి బావిలో 9 శవాల ఫొటోల్ని అర్ధరాత్రి తీశాడు. శవాల గురించి కంటే బ్యాడ్ లైటింగ్‌లో ఫొటో రాదేమోనని ఆలోచించాడు.
ఫీల్డ్‌లో ఉన్న జర్నలిస్టులు చాలా బాధలు పడుతారు. ఈ పోటీ ప్రపంచంలో టైంకి న్యూస్ అందించకపోతే ఉద్యోగం పోతుందని భయం. నిద్ర ఉండదు, సమయానికి తిండి దొరకదు. సున్నితత్వం పోతుంది. ఎంత చేసినా మెడమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. పేరుకు జర్నలిస్టు సంఘాలుంటాయి కానీ, అవి చేయగలిగింది ఏమీ లేదు. కార్మిక సంఘాల గురించి వ్యాసాలు రాసే పత్రికలు, జర్నలిస్టులకు ఏ హక్కులూ లేకుండా చేశాయి. నేను 26 సంవత్సరాలు జర్నలిస్టుగా అనేక హోదాల్లో పనిచేశాను. జర్నలిస్టు చనిపోయినా, గాయపడినా యాజమాన్యాలు బాధ్యతగా సాయం చేసిన సందర్భాలు చాలా తక్కువ చూశాను.
ఒక రకంగా చెప్పాలంటే మునుపెన్నడూ లేనంత నిస్సహాయ స్థితిలో జర్నలిస్టులున్నారు. మార్చి నెలలో పది రోజుల లాక్‌డౌన్‌కే చాలా మంది ఉద్యోగాలు పోయాయి. ఇంకా పోతాయి. ఈ పరిస్థితుల్లో కరోనాకి భయపడి ఆగిపోతే ఉపాధి పోతుంది కాబట్టి భయంభయంగానే పనిచేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో కూడా వార్తలు మిస్ అయితే ప్రశ్నించే క్రూరత్వంలోనే యజమాన్యాలున్నాయి. ఎద్దుపుండు కాకికి ఎపుడూ కష్టం, బాధ కాదు.
ముంబయ్‌లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భయం ఉంది. ప్రభుత్వాలు చేయాల్సింది ఏమంటే ఈ కష్ట కాలంలో జర్నలిస్టులకి ఉద్యోగ భద్రత కల్పించడం. మూడు నెలల అద్దె అడగొద్దని ఇళ్ల యజమానులని హెచ్చరించినంత సులభం కాదు, వీళ్లని హెచ్చరించడం. అయినా ప్రభుత్వాలు అనుకుంటే సాధ్యం కానిది లేదు. రూ.50 లక్షల ఆర్థిక సాయం వీళ్లకీ వర్తించాలి. ఎందుకంటే ప్రాణం అందరికీ సమానమే. పోలీసులకి, హెల్త్‌వర్కర్లకే కాదు, జర్నలిస్టులకి కూడా కుటుంబాలుంటాయి. వాళ్లకీ ఆకలి ఉంటుంది.