హైదరాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..

  • Published - 02:43 AM, Thu - 14 May 20
హైదరాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..

హైదరాబాద్‌లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చనున్న ఆర్టీసీ బస్సులు

లాక్‌డౌన్‌ కారణంగా అనేకమంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రజలు హైదరాబాద్‌లో చిక్కుకున్నారు. అలా చిక్కుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు వీలుగా హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకుంటే తప్ప ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండదు.

స్పందన పోర్టల్ లో అప్లై చేసుకోవడంతో పాటు తమ సొంత ఊళ్లకు చేరుకున్న తర్వాత జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉండేందుకు అంగీకరించిన వారికి మాత్రమే టిక్కెట్లు జారీ చేయనున్నారు. దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఆదేశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులు జారీ చేశారు.

స్పందన పోర్టల్ ద్వారా దాదాపు 13 వేలమంది ఆంధ్రప్రదేశ్ కి వస్తామంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిని స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. కాగా ఈ సర్వీసులు మియాపూర్‌-బొల్లారం క్రాన్‌రోడ్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, ఎల్బీనగర్‌లలో మొదలయి నేరుగా ఎక్కడా ఆగకుండా ఆంధ్రప్రదేశ్ లోని ఆయా డిపోలకు చేరుకుంటాయి.కానీ ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జ్, నాన్‌ ఏసీ బస్సుల్లో సూపర్‌ లగ్గరీ ఛార్జీలను ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రజల నుండి తీసుకోనున్నారు. ఈ సర్వీసుల్లో కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే వీలు లేదు కాబట్టి ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.

Show comments