iDreamPost
iDreamPost
ఏపీ తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో పలువురు నేతలు గొంతు విప్పారు. కొందరు నేతలు ఓ అడుగు ముందుకేసి అధిష్టానం తీరు మీద ఘాటు విమర్శలు చేశారు. కార్యకర్తల ముందే రాష్ట్ర కేంద్రం తీరు మీద ఘాటుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. అధినేత ఎదురుగా సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. టీడీపీలో అసంతృప్తులకు అద్దంపట్టేలా ఆ వ్యాఖ్యలున్నాయి. పలువురు నేతలు బాబు అండ్ కో తీరుతో ఏమాత్రం సంతృప్తి లేరనే సంకేతాలు వెళుతున్నాయి. ఈ పరిణామాలు చంద్రబాబుని కూడా ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తోంది. దాంతో ఆయన దూకుడు పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నేతలు తలోదారి అన్నట్టుగా సాగుతున్నారు. అప్పటి వరకూ అధినేత ముందు నోరు మెదపడానికి కూడా సిద్ధం కాని నేతలు ఇప్పుడు సైలెన్స్ వీడుతున్నారు. అధిష్టానం తీరు మీద దుమ్మెత్తిపోస్తున్నారు. నేరుగా చంద్రబాబు ఉండగా, పార్టీ విస్తృత సమావేశంలో అయ్యన్నపాత్రుడు, కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోనే ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు తగ్గించి ప్రజల్లోకి వెళితే మంచిదంటూ కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పదే పదే ప్రెస్ మీట్లతో చెప్పిందే చెప్పడమే అన్నట్టుగా సాగుతున్న నేతల తీరు సక్రమంగా లేదని ఆయన తన అసహనాన్ని ప్రదర్శించడం విశేషంగా మారుతోంది. యనమల వంటి కొందరు నేతల తీరు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న కరణం ఈ వ్యాఖ్యలు చేసినట్టు కొందరు సందేహిస్తున్నారు.
అదే సమయంలో అయ్యన్న పాత్రుడు కూడా పార్టీ తీరు సక్రమంగా లేదని తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, అప్పటికప్పుడు సమాచారం పంపించడం ఏంటని ఆయన నిలదీశారు. రేపటి కార్యక్రమానికి ఈరోజు సాయంత్రం సమాచారం అందిస్తారా అంటూ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో సమన్వయం లేదని చెప్పేశారు. తద్వారా అధినేత తీరు మార్చుకోవాలని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టు కనిపిస్తోంది. ఇంకా మరికొందరు నేతలు సీనియర్ల మాదిరి సూటిగా కాకపోయినా పార్టీ పరిస్థితి బాగోలేదని చెప్పడంతో బాబు ఖంగుతిన్నట్టు కనిపిస్తోంది. తొలిసారిగా టీడీపీలో అత్యధికంగా భిన్నస్వరాలు, అపస్వరాలు వినిపించడంతో బాబు పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు.
ఈ పరిణామాలతో ఖంగుతిన్న చంద్రబాబు పార్టీ కి పునరుత్తేజం కల్పించేందుకు రాష్ట్రమంతా బస్సు యాత్ర చేస్తాననే ప్రతిపాదన ముందుకు తీసుకురావడం విశేషం. ఇటీవల అమరావతి పేరుతో పలు జిల్లాల్లో ప్రచారం , పలు కార్యక్రమాలు చేపట్టినా ఉత్తరాంధ్ర గానీ, రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఆయన కాలు పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ ప్రచారం, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో చాటేందుకు తగ్గట్టుగా బస్సు యాత్రకు ప్రణాళిక రచిస్తున్నట్టు చెబుతున్నారు. 13 జిల్లాల్లోనూ ఈ యాత్ర చేపట్టాలని ఆయన ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. దాంతో పార్టీలో నేతల నుంచి వస్తున్న విమర్శలను అధిగమించి ముందుకు సాగేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా ఉంటాయా అన్నది అనుమానంగా ఉంది. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉండగా స్థానిక సమరం కోసమే చంద్రబాబు ఇంత సీన్ చేస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం అవుతోంది.