iDreamPost
iDreamPost
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ సమగ్రాభివృద్ధి, రాజధాని కోసం నియమించిన కమిటీ రిపోర్ట్ వెలువడింది. సీఎంకి తుది నివేదిక అందించిన తర్వాత కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, నాలుగు రీజియన్లు ఉండాలని కమిటీ సూచించింది.
అమరావతి– మంగళగిరి కాంప్లెక్స్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్, శాసనసభ,ఎమ్మెల్యే క్వార్టర్స్ వంటివి ఏర్పాటు చేయాలని తెలిపింది. తుళ్లూరు ప్రాంతంలో ముంపు ప్రమాదం ఉన్న చోట్ల నిర్మాణాలు నిలిపివేయాలని సూచించారు. అమరావతి రైతులకు సంబంధించి భూములు అభివృద్ధి చేసి అప్పగించాలని సూచించినట్టు జీఎన్ రావు తెలిపారు.
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం సెక్రటేరియేట్ తో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్, హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని సూచించినట్టు ఆయన వివరించారు. వేసవికాలంలో శాసనసభ సమావేశాలు జరపాలి. విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద మొత్తంలో భూములు ఉండడంతోనే కమిటీ ఈ సూచన చేసిందని ఆయన వివరించారు.
కర్నూలులో న్యాయవ్యవహారాల రాజధానిగా హైకోర్ట్ తో పాటుగా ఇతర న్యాయ సంస్థలు ,సీఎం క్యాంప్ ఆఫీస్, శీతాకాలపు వేసవి శాసనసభ సమావేశాలు జరపాలని సూచింనట్టు వెల్లడించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చెయ్యాలి. రాయలసీమ నీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చెయ్యాలి. గోదావరి-పెన్నా అనుసంధానం కూడా త్వరగా పూర్తి చెయ్యాలి.
అదే సమయంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నాలుగు రీజియన్లుగా రాష్ట్రాన్ని విభజించాలని కమిటీసూచించింది. అందులో ఉత్తరాంధ్ర ఒక రీజియన్ గానూ, గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాను కలిపి మరో రీజియన్ గానూ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను మరో రీజియన్ గానూ, రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి ఒక రీజియన్ గా అభివృద్ది చేసేందుకు కర్ణాటక తరహాలో రీజియనల్ డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచింనట్టు వెల్లడించారు.
ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు తగ్గట్టుగా తాజాగా కమిటీ రిపోర్ట్ కూడా ఉండడంతో ఇక ఏపీలో కొత్త రాజధాని ఖాయం అనే అంచనాలు మరింత బలపడ్డాయి. సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు సమ్మర్ లో విశాఖలో అసెంబ్లీ సమావేశాలని సూచన చేయడంతో రాజధానిగా విశాఖపట్నం ఖాయం అయ్యిందనే భావించవచ్చు.