Idream media
Idream media
ప్రభుత్వ ఉద్యోగుల అత్యుత్సాహం చివరికి వారి ఉద్యోగానికి చేటు తెస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన కారణంగా ఓ పక్క వివిధ విభాగాల్లోని ఉద్యోగులు సమస్యలు కొని తెచ్చుకుంటున్నా.. కొంత మంది ఉద్యోగుల తీరు మాత్రం మారడంలేదు. ప్రభుత్వ ఉద్యోగులమనే సృహ లేకుండా సీఎంను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు, సీఐడీ కేసులు నమోదు చేస్తుండగా.. ఆ కారణంతో వారి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.
తాజాగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏజీఎం సీఎంపై అనుచిత పోస్టు పెట్టిన కారణంగా సస్పెండ్‌కు గురయ్యారు. గతంలో కరోనా కట్టడిపై సీఎం జగన్ మాట్లాడిన.. పారాసిటమాల్, బ్లీచింగ్ వ్యాఖ్యలను హేళన చేస్తూ సదరు మహిళా ఏజీఎం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. తన వాట్స్ అప్‌కు వచ్చిన పోస్టును తన పిల్లలు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారంటూ ఆమె చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై సీఐడీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ బ్యాంకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
సద్విమర్శలు మినహా.. సీఎం, మంత్రులు, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు, సీఐడీ విభాగం ఉక్కుపాదం మోపుతోంది. వాక్ స్వతంత్య్రాన్ని దుర్వినియోగం చేస్తూ పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నిర్మాణాత్మక, సద్విమర్శలు చేయడం వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ పలువురు అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు పెడుతుండడంపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్‌కు గురయ్యారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విభాగంలోని సిబ్బంది అయితే.. ఉద్యోగాలను కోల్పోయారు.