Idream media
Idream media
నిన్న ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో గాదె వైసీపీలో చేరారు. గాదెతోపాటు ఆయన కుమారెడు గాదె మదుసూధన్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు.
నిన్న టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయం గుంటూరు జిల్లా బాపట్లలో మీడియాకు వెళ్లడించిన గాదె వెంకటరెడ్డి చంద్రబాబుపై త్రీవస్థాయిలో ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు మదుసూధన్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయడంతో 2015లో ఆ పార్టీలో చేరినట్లు గాదె తెలిపారు. కేవలం రాష్ట్ర కార్యదర్శి పదవితో సరిపెట్టారని వాపోయారు. టీడీపీలో తమకు అవమానాలు జరగడంతోనే పార్టీని వీడుతున్నామని గాదె మదుసూధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరేది మీడియా సమావేశంలో చెప్పని గాదె మరుసటి రోజే వైసీపీలో చేరడం విశేషం.
రాష్ట్ర రాజకీయాల్లో గాదె వెంకటరెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి గాదె ప్రజా ప్రతినిధి జీవితం ప్రారంభమైంది. 1967లో ఆయన మొదటి సారి పర్చూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి ఆయన 5 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. చివరగా 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.