iDreamPost
iDreamPost
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అమలు అయిన కొన్ని రోజులకు వలస కార్మికులు సమస్యలు దేశం ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు షెల్టర్ లేక, ఆహారం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే వారంతా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పయణమైయ్యేందుకు యత్నిస్తున్నారు. వందల కిలో మీటర్లు నడుచుకుంటూ, సామాగ్రిని నెత్తిపై పెట్టుకుంటూ, పసి పిల్లలను చెంకని వేసుకొని ఎర్రటి ఎండలలో తమ గ్రామాలకు పయణమైయ్యారు. ఇలా నడిచి వెళ్లిన వారిలో కొందరు మార్గ మధ్యలోనే మరణించారు. దీంతో దేశంలో వలస కార్మికులు సమస్య ప్రధాన అంశంగా మారింది. వలస కార్మికుల సమస్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తారు. మీడియా కూడా ప్రధాన శీర్షికలు పెట్టి ప్రచారం చేశారు. దీంతో మొద్దు నిద్రలో ఉన్న మోడీ సర్కార్‌కు మెలుకువ వచ్చింది. వలస కార్మికులను తమ స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లు వేసింది. అయితే దేశంలో దాదాపు 15 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల్లో ఉన్నారు. వీరిలో కేవలం 3 నుంచి 4 లక్షల మందిని మాత్రమే కేంద్ర ప్రభుత్వం తరలించింది. మిగిలిన వారి సంగతి ఏంటో ప్రభుత్వం చెప్పటం లేదు. ఇప్పటికీ కూడా చాలా మంది వలస కార్మికులు నడుచుకుంటూ, సైకిల్స్ తొక్కుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ లో నడుచుకుంటూ, ట్రక్కుల ద్వారా తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి ప్రయత్నించిన కనీసం 116 మంది వలస కార్మికులు, మే 1 నుండి ప్రభుత్వం ‘శ్రామిక’ ప్రత్యేక రైళ్లను నడపడం ప్రారంభించినప్పటి నుండి ఈ 16 రోజుల్లో రోడ్డు, రైలు ప్రమాదాల్లో మరణించారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఇందులో శనివారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్‌లోని అవురియాలో వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు ఢీ కొనడంతో 27 మంది వరకు మరణించారు. వారు పనిచేస్తున్న రాజస్థాన్ నుండి ట్రక్కుపై ప్రయాణించి, బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ లోని తమ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ విషాదం సంభవించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే.. మధ్యప్రదేశ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ జిల్లాలోని బండా సమీపంలో ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు వలస కార్మికులు ప్రాణాలు విడిచారు. మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులతో సహా 15 మంది గాయపడ్డారు. వలస కార్మికులు రోడ్లు, రైలు పట్టాల గుండా నడుస్తుంటే తమ బాధ్యత వహిస్తామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం రాష్ట్రాలకు లేఖ రాసినప్పటికీ ఈ ప్రమాదాలు జరిగాయి. వలస కార్మికులు ప్రత్యేక రైళ్లను ఎక్కే విధంగా చూడాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.
మే 1 నుంచి మే 16 మధ్య 27 రహదారి, రైలు ప్రమాదాలలో 116 మంది మరణించారు. 159 మంది గాయపడ్డారు. మే 16 న జాతీయ వలస సమాచార వ్యవస్థపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తయారు చేసిన ఒక నోట్‌లో ఇప్పటి వరకు 350 ప్రత్యేక రైళ్లలో 3.5 లక్షల మంది వలస కార్మికులను తరలించామని, ఇలాంటి మరిన్ని ప్రయాణాలను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ పరిమితుల పొడిగింపు వార్తలు వెలువడడంతో వలస కార్మికుల కదలిక రెండో సారి మే ప్రారంభంలో లాక్ డౌన్ 2.0 చివరికి ప్రారంభమైంది. శ్రామిక ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినది. అయిన వలస వెళ్లే కార్మికులు స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏప్రిల్‌లో వలస కార్మికులు తమ గ్రామాలకు పయణమైయ్యారు. కాని ఆ నెల చివరి వరకు తీవ్రత పెరిగింది.
ఈ నెలలో జరిగిన విషాద సంఘటనలలో ఒకటి మే 7న మహారాష్ట్రలోని రంగాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది వలస కార్మికులు మరణించారు. మధ్యప్రదేశ్ వెళ్తున్న వలస కార్మికులు అలసిపోయినట్లు భావించి రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై రైలు వెళ్లడంతో 16 మంది వలస కార్మికులను అక్కడిక్కడే మృతి చెందారు. మే 13 న పంజాబ్ నుంచి బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మే 10న మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో మామిడితో నిండి ఉన్న ట్రక్కు బోల్తా కొట్టడంతో హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వైపు వెళ్తున్న ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఇలా రోడ్డు ప్రమాదాలతోనే మృతి చెందిన వారు ఉన్నారు. అలాగే ఆహారం లేక ఆకలితోనూ, వందల కిలో మీటర్లు నడవటంతో గుండె పోటు, ఆయాసంతో మరణించిన వలస కార్మికుల అనేక మంది ఉన్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వం లెక్కించటం లేదు. వీరికి పరిహారం ఇవ్వటం లేదు. వీరిని గుర్తించాల్సిన అవసరం ఉంది. వీరికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.