iDreamPost
android-app
ios-app

ఏ విపత్తుకీ కోతలు….?

ఏ విపత్తుకీ కోతలు….?

ప్రజాస్వామ్య దేశాల్లో అధికారం లెజిస్లేచర్(చట్టసభలు), ఎగ్జిక్యూటివ్(అధికార యంత్రాంగం), జ్యుడీషరీల(న్యాయవ్యవస్థ) మధ్య విభజితమై ఉంటుంది. ఈ మూడు వ్యవస్థల పనితీరును ఓ కంట కనిపెట్టే వ్యవస్థే… ప్రెస్ అండ్ మీడియా. దీన్నే మనం ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తుంటాం. అయితే కొన్ని మీడియా యాజమాన్యాల తీరుతో ఫోర్త్ ఎస్టేట్ కాస్త తన ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. అదేకానీ జరిగితే మిగిలిన మూడు వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదం లేకపోలేదు….!

రాజకీయ, తత్వవేత్తయిన ఎడ్మండ్ బుర్కే 1787లో బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాను ఉద్దేశించి ఫోర్త్ ఎస్టేట్ పదప్రయోగం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగిన మీడియా….మిగిలిన మూడు వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు విస్తృత కృషి చేసింది.

వేలాడుతున్న కత్తి…!

ప్రజాస్వామ్యంపై కత్తి వేలాడుతోందా…! అవును..కరోనా ప్రజాస్వామ్యాన్ని… మానవహక్కులను కాపుకాసే జర్నలిస్టులను చావుదెబ్బ కొడుతోంది. అయితే పైకి కరోనా ఓ కారణంగా కనిపిస్తున్నా… కొన్ని యాజమాన్యాల లాభాపేక్ష దీనికి ప్రధాన కారణంగా ఉంది. ఏ జర్నలిస్టుల కష్టాన్ని ఆసరాగా చేసుకొని వేల కోట్లు ఆర్జించారో వారినే ఇప్పుడు ఏమాత్రం సహానుభూతి లేకుండా రోడ్డున పడేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. వీరికి ఈ ఆపత్కాలంలో ఇంతకాలం వచ్చిన లాభాల్లో నుంచి చిల్లిగవ్వ కూడా వెచ్చించేందుకు మనసు రాకపోవడం నిజంగా శోచనీయం.

భజనే…భరోసా..!

ఏ యాజమాన్యమైనా సిబ్బందిని కుదించే క్రమంలో… పనిచేయని వారిని, అర్హతలకు మించి శాలరీలు పొందుతున్నవారిని తొలగించాలనుకుంటాయి. కానీ, మధ్యలో ఉండే ఇంఛార్చ్ లు తమ అడుగులకు మడుగులెత్తే వారిని…తమకు భజన చేసేవారిని… ఇతరత్రా చదివింపులు చేసేవారిని కాపాడి…కష్టపడి పనిచేసి సంస్థకు ఉపయోగపడేవారిని బలిచేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే పత్రికల్లో కేవలం తాలు మాత్రమే మిగిలి…వార్తల నాణ్యత తగ్గుతుంది. ఫలితంగా పేపర్ ప్రమాణాలు పడిపోతాయి. కాబట్టి తొలగించే పరిస్థితే కనుక వస్తే యాజమాన్యాలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

అవినీతి పెరుగుతుందా…!

ప్రపంచంలోని 180 దేశాలు, ప్రాంతాలతో రూపొందించిన అవినీతి సూచీలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనకంటే చిన్నదేశాలైన భూటాన్, చిలీలు మెరుగైన ర్యాంకులు పొందాయి. పత్రికలు జిల్లా ఎడిషన్లను నిలిపివేయడం, స్థానిక రిపోర్టర్లను తొలగించడం వంటి చర్యలు వల్ల మండల, జిల్లా స్థాయిల్లో అవినీతి పెరుగుతుంది. కింది స్థాయి అధికారులు, పాలనా వ్యవస్థల్లో పారదర్శకత లోపిస్తుంది. ప్రస్తుతం పత్రికలు జిల్లా వార్తలను మెయిన్ లో ఇస్తున్నప్పటికీ…అవి కేవలం అరకొరగానే ఉంటున్నాయి. తెలంగాణ లో 438, ఆంధ్రప్రదేశ్ లో 676 మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో జరిగే అభివృధ్ధి, సంక్షేమ పథకాల్లో అవకతవకలను మెయిన్ లో కేవలం రెండు పేజీల్లో(ఇందులో సగం ప్రకటనలు) కవర్ చేయడం కుదిరే పనికాదు. ఫలితంగా అవినీతి పెచ్చురిల్లడంతోపాటు ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది.

ప్రభుత్వాలు…మీదే భాద్యత..!

గుడ్ గవర్నెన్స్ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటి కృషి ఫలించాలంటే మీడియా భలంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాకాని పక్షంలో ప్రభుత్వాల కృషి నీళ్ల పాలవుతుంది. కాబట్టి మీడియాను నిలబెట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈ దిశగా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ట్యాక్స్ మినహాయింపు…ఇతరత్రా ప్రోత్సాహకాలు ప్రకటించాలి. అవసరమైతే మీడియా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మీడియా నిర్వహణకు రెండేళ్ల పాటు వడ్డేలేని రుణాలు ఇవ్వాలి. న్యూస్ ప్రింట్ పై కస్టమ్స్ డ్యూటీ తొలగించాలి. ప్రస్తుత పరిస్థితిపై ఆయా యాజమాన్యాలతో ప్రభుత్వాలు సమావేశం నిర్వహించాలి. ఇలా చేయగలిగితే మీడియా పరిరక్షణతోపాటు ప్రజాస్వామ్యం సైతం వర్ధిల్లుతుంది.