iDreamPost
android-app
ios-app

గల్వాన్‌ ఘటన నేపథ్యంలో కేంద్రంపై మాజీ ప్రధాని  మన్మోహన్‌ సింగ్ వ్యాఖ్యలు

గల్వాన్‌ ఘటన నేపథ్యంలో కేంద్రంపై మాజీ ప్రధాని  మన్మోహన్‌ సింగ్ వ్యాఖ్యలు

సంక్షోభ సమయంలో ఏకతాటిపై నిలబడి సవాళ్లను ఎదుర్కోవాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇటీవల సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై సమాచారం బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన‌ చేశారు.

దాచి ఉంచడం దౌత్యనీతికి, సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. దేశ భద్రతపై ప్రధాని మోడీ గతంలో చెప్పిన మాటల్ని గుర్తుంచుకోవాలన్నారు. కర్నల్‌ సంతోష్‌ బాబు సహా అమర జవాన్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ న్యాయం చేయాలని మన్మోహన్‌ కోరారు.

వారికి ఏం తక్కువ చేసినా ప్రజల నమ్మకానికి చారిత్రక ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు భవిష్యత్‌ తరాలు భారత్‌ను చూసే దృక్కోణంపై ప్రభావం చూపుతాయన్నారు.

దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధానిపైనే ఉంటుందని, బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని హితవు పలికారు. తాను చేసే వ్యాఖ్యల పర్యవసానాల పట్ల ప్రధాని ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. 

దేశ సమగ్రతను కాపాడేందుకు అమరవీరులు అసమాన త్యాగం చేశారంటూ వారి సేవలను మన్మోహన్ సింగ్ కీర్తించారు. చైనాతో సమస్య ముదరకుండా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. 

గల్వాన్‌ లోయతో పాటు పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మన్మోహన్‌ అన్నారు. ఏప్రిల్‌ నెల నుంచే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశాన్ని రక్షించుకునే విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగిపోవద్దని హితవు పలికారు. ప్రధాని తన మాటలతో ప్రత్యర్థులకు స్వేచ్ఛనివ్వొద్దన్నారు. 

భారత భూభాగాలు ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోడీ శుక్రవారం జరిగిన అఖిల పక్ష భేటీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అదే నిజమైతే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు తలెత్తాయంటూ ప్రతి పక్షాలు నిలదీశాయి. ప్రధాని మాటలు చైనాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లుగా ఉన్నాయని ఆరోపించాయి.

దీంతో రంగంలోకి దిగిన ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ),..విపక్షాల విమర్శలు సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడింది. వాస్తవాధీన రేఖను అతిక్రమించే ప్రయత్నాలను మన సైన్యం గట్టిగా తిప్పికొట్టే యత్నంలోనే హింసాత్మక ఘటన చోటుచేసుకుందని వివరించింది. తాజాగా గళం విప్పిన సర్దార్ జీ…మోడీ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.

మరోవైపు విలక్షణ నటుడు కమల్ హసన్ కూడా ప్రధాని మోడీ వైఖరిపై మండిపడ్డారు. భారత్‌-చైనా సరిహద్దులో హింసాత్మక ఘర్షణలకు సంబంధించి ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మలచుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధ్యక్షుడు కమల్‌ హసన్‌ విమర్శించారు. ప్రశ్నించే వారిని జాతి వ్యతిరేకులుగా చూడడం తగదని, ప్రశ్నించడమే ప్రజాస్వామ్యానికి పునాది అని వ్యాఖ్యానించారు. వాస్తవాలు వెల్లడయ్యేవరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో తెలిపారు.