iDreamPost
iDreamPost
ఆంధ్ర ప్రదేశ్ కి జీవనాడిలాంటి ప్రత్యేక హొదా విషయంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకం మరోసారి బయటపడింది. రాష్ట్ర విభజన వలన పూర్తిగా నష్టపోయిన సీమాంధ్ర ప్రాంతానికి ఉపశమన మంత్రంగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. రాష్ట్రానికి హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి ఆర్ధికంగా రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో పోటి పడే స్థాయికి ఎదుగుతుందని ఆశపడ్డ సీమాంధ్రులను నిలువునా వంచన చేసింది భారతీయ జనతా పార్టీ. 2014 లో ప్రత్యేకహోదా హామీతో ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత , హొదా విషయంలో పూటకో మాట, రోజుకో వాదనతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వచ్చారు.
తొలుత 14 ఫైనాన్స్ కమీషన్ వలనే ప్రత్యేక హొదా ఇవ్వటం కుదరదని బి.జే.పి చెప్పుకుంటూ వచ్చింది. దానికి నాడు పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ కోరస్ పాడింది. వాస్తవానికి నాడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా 14 ఫైనాన్స్ కమీషన్ ప్రత్యేక హొదా ఇవ్వడం కుదరదని ఎక్కడా చెప్పలేదని, 14 ఫైనాన్స్ కమీషన్ సభ్యుడు అయిన అభిజిత్ సేన్ రాసిన లేఖను కూడా సాక్ష్యంగా చూపితే, ప్రతిపక్ష నాయకుడికి అవగాహన లేదు అని వాస్తవాన్ని తొక్కిపెట్టే తెలుగుదేశం బి.జే.పి కూటమి ప్రయత్నం చేసింది . అక్కడితో ఆగకుండా ప్రణాళిక సంఘం రద్దు అయి, నీతి ఆయోగ్ రావటం వలనే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన బి.జే.పితో గొంతు కలిపింది తెలుగుదేశం. నిజానికి ప్రణాళిక సంఘం బి.జే.పి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలలు వరకు జీవించే ఉందని, అదీకాక బి.జే.పి ప్రణాళిక సంఘంని రద్దు చేయటం లేదా దాని పేరు మార్చటం అనేది కేవలం రాజకీయ నిర్ణయం అని, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హొదా ఇచ్చింది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ద్వారానే అని. అదీకాక ఆ 11 రాష్ట్రాలకు ప్రత్యక హొదా యథావిధిగా కొనసాగుతుందని ఇదే విషయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసిందని ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటానికి గల సరైన కారణం ఎందుకు చెప్పలేకపొతున్నారని కేంద్రాన్ని నిలదీశారు జగన్.
బి.జే.పి రచించిన వంచన ఎజెండాను రాష్ట్రంలో అమలు చేసే భాగంగా తెలుగుదేశం , ప్రత్యేక హోదా ఉంటే ఏం అద్బుతాలు జరుగుతాయి అని నాడు హేళనగా మాట్లాడటం మొదలు పెట్టింది. తెలుగుదేశం మాటలను తప్పు పడుతు యువభేరీల్లో, హొదా వలన రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు జగన్. ప్రత్యేక హొదా ఉంటే వచ్చేది చిన్నా చితకా రాయితీలు కాదు , పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటి మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్నులో కూడా 100 శాతం రాయితీ లభిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ పై 3 శాతం వడ్డి రాయితీలు లభిస్తాయి. కేంద్రం నుండి గ్రాంట్లు 90 శాతం వస్తాయి, అది తిరిగి మనం చెల్లించక్కరలేదు. అదే లొన్ గా తీసుకుంటే తిరిగి చెల్లించాలి. హంద్రి-నీవా , గాలేరు-నగరి లాంటి నీటి ప్రజెక్టులకు ప్రత్యేక హొదా ఉంటే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ షో ప్రోగ్రాం కింద 90 శాతం గ్రాంట్ వస్తుంది. హొదా ఉంటే మన రుణాలను కేంద్రమే చెల్లిస్తుంది, మెట్రొ కారిడార్ కర్చు కెంద్రం బరిస్తుంది, ఇలాంటి రాయితీలు ఉంటే పక్క రాష్ట్రాల నుండి పరిశ్రమలు మనం అడగకుండానే రెక్కలు కట్టుకుని వస్తాయి అని, లెక్కలు పూర్తి వివరాలతొ ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యే రితిలో వివరిచే ప్రయత్నం చేసి ప్రత్యేక హోదా ఆకాంక్షను సజీవంగా ఉంచే ప్రయత్నంలో జగన్ సఫలీకృతం అయ్యారనే చెప్పాలి.
రాష్ట్ర ప్రజలను తమ మాటలతో మోసం చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు తో బుద్ధి చెప్పినా బిజేపీ తీరులో మార్పు వచ్చినట్టు కనిపించటంలేదు. ఎన్నికల్లో వై.యస్ ఆర్ కాంగ్రెస్ పార్టి విజయం సాధించిన వెంటనే ప్రత్యేక హోదా కోరుతూ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు, ఈ తీర్మానానికి మండలిలో బి.జే.పి సభ్యుడైన మాధవ్ కూడా మద్దతు పలికారు. పార్లమెంటులో అనేక సార్లు విజయ సాయి రెడ్డి , మిథున్ రెడ్డి ప్రత్యేక హొదా పై స్పష్టత ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టిని కోరగా సరైన సమాధానం ఇవ్వకపోగా గతం లో తెలుగుదేశంలో ఉన్న సుజనా చౌదరి లాంటి నాయకులు రాష్ట్రానికి అన్ని వచ్చాయి అని చెప్పిన మాటలను ఉటంకిస్తు మరోసారి మోసానికి తెరలేపారు.
అయితే తాజాగా భారతీయ జనతా పార్టి ఆడుతున్న డ్రామాలకి చెక్ పడేలా కొత్తగా ఏర్పడిన 15వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా పై స్పష్టత ఇచ్చింది. నివేదికలో ఉన్న 7వ చాప్టర్ 7.4వ క్లాజులో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హొదా కోరుతున్నాయని, అయితే ఆ రాష్ట్రాలకు ప్రత్యక హొదా కల్పించాలా వద్దా అనే అంశం పూర్తిగా కేంద్రానిదే తుది నిర్ణయం అని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అన్న అంశం తమ పరిధిలోనిది కాదని చెప్పుకొచ్చింది. ఇన్నిరోజులు 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పుకుంటూ తప్పించుకున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన వివరణ తో ఖచ్చితంగా హోదాపై నిర్ణయం చెప్పే పరిస్థితి ఏర్పడింది . అయితే ప్రజలకు ఇవేమి తెలియవనే ఉద్దేశమో ఏమో కాని ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హొదా ఇచ్చే అవకాశం లేదని నిన్న లోక్ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. 15వ ఆర్ధిక సంఘం నివేదికలో ఉన్న అంశాలను పరిశీలించకుండా తమ నోటికి వచ్చినట్టు ప్రకటనలు ఇవ్వటం భారతీయ జనతా పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని రాష్ట్ర ప్రజలు నుండి వినిపిస్తున్న మాట.
ఏది ఏమైన ఇన్నిరోజులు ప్రత్యేక హోదాకు 14వ ఆర్ధిక సంఘం నివేదికను భూచి గా చూపిన బిజేపికి 15వ ఆర్ధిక సంఘం నివేదికతో తప్పక స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా రాష్ట్రంలో ఎదగాలనుకునే బిజేపికి ప్రత్యేక హొదా పై స్పష్టమైన నిర్ణయం ప్రకటించేంత వరకు మనుగడ కష్టమే అనేది మెజారిటి విశ్లేషకుల అభిప్రాయంగా తెలుస్తుంది.