Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి అధికార వైయస్సార్సీపి తమ పార్టీలో చేరే నాయకుల కోసం తలుపులు బార్లా తెరిచింది.దీంతో ప్రతిపక్ష టిడిపి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు, సీనియర్ నేతలు వైయస్సార్సీపిలో చేరేందుకు క్యూ కడుతున్నారు.తాజాగా మాజీ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబుకు షాక్ ఇచ్చింది.
గత 27 ఏళ్లగా పార్టీలో కొనసాగుతున్నా తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని అందుకే మనస్తాపంతో రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.తన అభిమానులు,అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని లలిత కుమారి చెప్పారు.కానీ ఆమె వైఎస్సార్‌సీపీలో చేరిక లాంఛనమేనని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
2004 శాసనసభ ఎన్నికలలో లలితకుమారి పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.2009 నియోజకవర్గ పునర్విభజనలో పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2019 ఎన్నికలలో కూడా టీడీపీ నుంచి బరిలోకి దిగినా విజయం దక్కలేదు.
2019 ఎన్నికల సమయంలో లలిత కుమారికి పూతలపట్టు టికెట్ కేటాయించే విషయంలో తెలుగుదేశంలో పెద్ద చర్చే నడిచింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన లలితకుమారిని మార్చాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. తొలుత పూతలపట్టు టిడిపి అభ్యర్థిగా పూర్ణంను ప్రకటించారు.నామినేషన్ ప్రక్రియ దశలో పూర్ణంను మార్చి చివరికి లలిత కుమారికే చంద్రబాబు జై కొట్టారు.2019 ఎన్నికల వేళ తన అభ్యర్థిత్వంపై టీడీపీలో నడిచిన హైడ్రామాతో అసంతృప్తికి గురైంది.ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న లలిత కుమారి ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.టిడిపి నాయకత్వంపై అసంతృప్తి చెందిన నాయకులతో పాటు,పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కూడా ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.