iDreamPost
android-app
ios-app

అక్కడకి రానంటేరాను.. ఇక్కడకైతే వస్తా..

అక్కడకి రానంటేరాను.. ఇక్కడకైతే వస్తా..

‘‘ నువ్‌ చంపుతావుంటే మేము పారిపోవాలా..? ఎవర్ని చంపుతావురా..? రేపు నీ ఊరికే వస్తా. దమ్ముంటే రా. నాయాల. కొ.. లా నిరాయుధులమైన మాపై దాడి చేయడం కాదు. రేపు రా.. చూసుకుందాం’’ ఇవీ మాచర్ల ఘటన జరిగిన రోజు సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు. ఆ రోజు ఇలా అన్న బొండా ఇప్పుడు వాగ్మూలం కోసం పోలీసులు పిలుస్తున్నా సరే మాచర్ల వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.

ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మాచర్ల వెళ్లారు. అక్కడ వారిపై వైసీపీ నేత తురకా కిషోర్‌ అనే వ్యక్తి కర్రతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆ రోజు ఏమి జరిగిందన్న విషయంపై బాధితులైన బొండా ఉమా, బుద్ధా వెంకన్నల వాగ్మూలం తీసుకునేందుకు మాచర్ల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాచర్లకు రావాలని వారికి నోటీసులు జారీ చేశారు.

మాచర్ల వస్తే తమను చంపేస్తారంటూ ఇప్పటికే బుద్ధా వెంకన్న వచ్చేది లేదని తెగేసి చెప్పగా మళ్లీ వస్తా చూసుకుందాం.. అని సవాల్‌ చేసి బొండా ఉమా కూడా వెంకన్న దారిలోనే నడిచారు. మాచర్ల వెళితే తమపై మళ్లీ హత్యయత్నం చేస్తారేమోనన్న అనుమానాలు బొండా ఉమా వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయం లేదా మీడియా సమక్షంలో తమను విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ విషయంలో తాము హైకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కాగా టీడీపీ ప్రజా ప్రతినిధుల వాగ్మూలం తీసుకునేందుకు పోలీసులు వారి ఇళ్లకు వెళ్లాలని భావిస్తున్నారు.