Idream media
Idream media
మ్యానిఫెస్టో అమలులో జగన్ ప్రభుత్వం భేష్ అని సిబిఐ మాజీ జాయింట్ డైరక్టర్, 2019 ఎన్నికల్లో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌వి పార్ట్ టైం రాజకీయాలని స్పష్టం చేశారు. ఇటీవలి ఒక టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజకీయ, ఉద్యోగ అంశాలపై వివిధ ఆసక్తికర అంశాలను వివరించారు. వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు జరిగిన ప్రక్రియ, అప్పుడు జరిగిన చర్చ వివరించారు. తాము చెప్పింది కాకుండా…కొన్ని మీడియా సంస్థలు తమకు నచ్చింది రాశారని తెలిపారు. టిడిపి విమర్శించినట్లు లక్ష కోట్ల అవినీతి కాదని, సిబిఐ కేవలం రూ.1,500 కోట్లకే చార్జ్ షీట్లు తయారు చేసిందని వివరించారు. కానీ మీడియా మాత్రం లక్ష కోట్లని గగ్గోలు పెట్టిందని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎంపి అభ్యర్థిగా తాను రూ.33 లక్షల ఖర్చు పెట్టానని, 2,88,754 ఓట్లు వచ్చాయని తెలిపారు. రాజ్యాధికారం కావాలని, అందుకోసం పని చేస్తానని పేర్కొన్నారు.
జగన్ మ్యానిఫెస్టోను ప్రాధాన్యంగా పాలన సాగిస్తున్నారు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోను ప్రాథన్యంగా పాలన సాగిస్తున్నారని లక్ష్మీనారాయణ తెలిపారు. “జగన్ పాలనపై ఏడాది పూర్తి అయిన తరువాత మార్కులు ఇద్దాం. కానీ జగన్ ప్రభుత్వం పాలన చాలా బాగా చేస్తుంది. వైసిపి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. మ్యానిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో…ప్రజలకు ఏం చేస్తామని చెప్పారో అవే అమలు అవుతున్నాయి. సాధారణంగా మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేస్తారు. వాటిని అమలు చేసే ప్రయత్నాలు చేయరు. మ్యానిఫెస్టో కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ జగన్ అలా కాదు. మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను చేయాలనే ప్రాధాన్యంగా జగన్ చేస్తోన్నారు ” అని జెడి పేర్కొన్నారు.
ఏపిలో 32 హై ప్రొఫైల్ కేసులు విచారించాను…కానీ జగన్ కేసును మాత్రమే మీడియా ప్రొజెక్టు చేసింది
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 32 హై ప్రొఫైల్ కేసులను విచారించాను. కానీ మీడియా కేవలం జగన్ కేసును మాత్రమే ప్రొజెక్టు చేసి ఉండొచ్చని అన్నారు. జగన్ కేసు విచారణ నుంచి తనను ఎవరూ బలవంతంగా తప్పించలేదని, తన టెన్యూర్ పూర్తి చేసుకొని మహారాష్ట్రకు వెళ్లానని తెలిపారు. అయితే తన టెన్యూర్ ఐదేళ్లని (2006లో జాయిన్ అయ్యానని, 2011 వరకు నా టెన్యూర్ అని) , కానీ రెండేళ్లు (2011 నుంచి 2013 వరకు) పొడిగించారని చెప్పారు. ఇక్కడ నుంచి జూన్‌లో రిలీవ్ అయ్యానని, తరువాత కుటుంబ అవసరాలు రీత్య రెండు నెలల పాటు సెలవు తీసుకొని, మళ్ళీ మహారాష్ట్రకు వెళ్తే…అక్కడ జనరల్ బదిలీలు అయిపోయాయని, అయితే వాళ్లు వెయిట్ చేయండి…వచ్చే బదిలీ ఆర్డర్‌లో మీకు అవకాశం కల్పిస్తామని అన్నారు. అప్పుడు ఎనిమిది నెలల తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిందని వివరించారు.
టిడిపి ప్రచారం చేసినట్లు లక్ష కోట్లు కాదు…కేవలం రూ.1,500 కోట్లే
జగన్ లక్ష కోట్ల అవినీతి చేశారని టిడిపి చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, జగన్‌పై సిబిఐ కేవలం రూ.1,500 కోట్లకే ఛార్జ్ షీట్లు వేసిందని తెలిపారు. “లక్ష కోట్లని టిడిపి నేతలు చేసే ఆరోపణల్లో నిజం లేదు. కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే. టిడిపి విమర్శించిన దానిలో 1.5 శాతం కూడా లేదు. కానీ మీడియా కూడా లక్ష కోట్లని ప్రచారం చేసింది” అని వివరించారు.
పవన్ పిలిచారు..నేను వెళ్లాను..ఆయనవి పార్ట్ టైం రాజకీయాలు
జనసేన అధినేత పవన్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. “పవన్ కళ్యాణ్ నన్ను ఆహ్వానించారు. మీరు మా పార్టీలో చేరితే బాగుంటుందని పవన్ అన్నారు. అప్పుడు నేను ఆ పార్టీలో చేరాను. నేను ఫుల్ టైం రాజకీయాలు చేయడానికి వచ్చాను. కానీ పవన్ జనసేన ఫుల్ టైం కాదని అన్నారు. దాంతో జనసేన ఫుల్ టైం రాజకీయ పార్టీ కాదని నాకు అనిపించింది. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్, నేను త్యాగాలు చేసి వచ్చామని చెప్పాం. అలాంటప్పుడు పూర్తికాలం రాజకీయాలు చేయకపోతే దానికి అర్థం ఉండదు. ఫుల్ టైం రాజకీయాలు కాదనే నిర్ణయం తీసుకున్న తరువాత నేను ఆ పార్టీలో ఇమడలేకపోయాను. నేను వెళ్లిపోతున్నానని, చెప్పి రాజీనామా చేసి, బయటకు వచ్చాను. ఆయనకు రాజీనామా లేఖ మాత్రమే పంపించాను. ముఖా ముఖి కలవలేదు. రాజీనామా చేసిన తరువాత పవన్ కళ్యాన్‌ను కలవలేదు”అని పేర్కొన్నారు.
కరోనా వల్ల వలస కార్మికులపై తీవ్ర ప్రభావం
“కరోనా వల్ల తీవ్రంగా ప్రభావానికి గురైనవారు వలస కార్మికులు. దేశంలో 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ వారు నడవల్సిన పరిస్థితి వచ్చింది. వలస కార్మికులు ఫోకస్ అయ్యింది కూడా ఇప్పుడే. అయితే ఇది ఒక ఈవెంట్ లా ఉండిపోకుండా శాశ్వత పరిష్కారం కావాలి” అని తెలిపారు. ఇటివలి సిబిఐలో చోటు చేసుకున్న పరిణామాలు జరిగి ఉండకూడదని, ఇలాంటివి సంస్థల పారదర్శకతపై మార్క్ పడుతుందని అన్నారు.