iDreamPost
android-app
ios-app

ఆలయ ప్రవేశాలకు అంతా సిద్ధం: శఠగోపానికి సెలవు!

  • Published May 17, 2020 | 3:13 AM Updated Updated May 17, 2020 | 3:13 AM
ఆలయ ప్రవేశాలకు అంతా సిద్ధం: శఠగోపానికి సెలవు!

ప్రపంచమంతా లాక్ డౌన్ కి దారి తీసిన వేళ చివరకు దేవాలయాల్లో భక్తులు లేక వెలవెలపోవాల్సి వచ్చింది. ఆలయాలన్నీ 50రోజులకు పైగా ఖాళీగా ఉన్నాయి. భక్తుల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో దర్శనాలన్నీ నిలిచిపోయాయి. ఇది ఆయా ఆలయాల ఆదాయాలపై కూడా ప్రభావం చూపింది. టీటీడీ లాంటి సంస్థల బడ్జెట్ ను తారుమారు చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ దర్శనాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో తగు జాగ్రత్తలతో దర్శనాలకు అనుమతించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సన్నద్ధం అవుతోంది.

ప్రధాన ఆలయాల్లో ఇకపై దర్శనాలు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయబోతున్నారు. ముఖ్యంగా భక్తుల వివరాల సేకరణకు, వారి కాంటాక్ట్ లను కనుగొనేందుకు అనుగుణంగా ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా పాజిటివ్ కేసులు నమోదయితే ఆధార్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించేందుకు అనుగుణంగా ఈ జాగ్రత్తలు పాటించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా దర్శనాలకు కూడా నిర్దిష్ట సమయం లో మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఉ. 6 నుంచి సా. 6గంటల వరకూ మాత్రమే క్యూ లైన్లో దర్శనాలు జరుగుతాయి. టైమ్ స్లాట్ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శనానికి వీలు ఉంటుంది. ఇప్పటికే క్యూ లైన్లలో దానికి అనుగుణంగా గీతలు గీస్తున్నారు. గంటకి 250 మంది లోపు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది.

ఇక అంతరాలయాల్లో కూడా అటు అర్చకులు, ఇటు భక్తులు తగు జాగ్రత్తలు పాటించేలా, భౌతికదూరం పాటించేలా పూర్తిస్థాయి నిబంధనావళి సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా శఠగోపం, తీర్థ జల పంపిణీ వంటివి నిలిపివేయాలని నిర్ణయించారు. శానిటైజర్లు, సబ్బులు కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. త్వరలోనే మళ్లీ ఆలయాల్లో భక్తులకు ప్రవేశం అనివార్యం కాబోతున్న తరుణంలో అందుకు తగ్గట్టుగా సన్నద్దం కావాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఆలయాల్లో ప్రవేశానికి అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.