iDreamPost
android-app
ios-app

భాషా రాజకీయం…పేదల పిల్లలే సమిధలు..!

భాషా రాజకీయం…పేదల పిల్లలే సమిధలు..!

పల్లకీలో కూర్చోవటానికి ఇష్టపడతాం… కానీ, ఆ పల్లకీ మన పిల్లలు మోయకూడదు…ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోనో..క్యాబ్‌ నో పిలుస్తాం…కానీ మన కొడుకో, మనవడో దాన్ని నడపకూడదు..! ఇదీ మానవ నైజం…! మనం..మన పిల్లలు విలాసవంతంగా జీవించాలి…దానికి ఏ కొందరో తమ జీవితాలను దారపోయాలి. ప్రస్తుతం ఏపీలో ఇంగ్లిష్‌ మీడియంపై జరుగుతున్న వాద ప్రతివాదనలు, చర్చోపచర్చల్లో ఈ కోణం ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతోంది…!

సంకుచిత తత్వం..!

ఇంగ్లిష్‌ మీడియంపై హైకోర్టు తీర్పు… ప్రభుత్వ వైఖరిలపై ఎవరి అభిప్రాయాలు వారికుండొచ్చు. కానీ వాటిని కొద్ధిగా పక్కనపెట్టి ఆలోచిస్తే… మనలోని సంకుచిత భావన మనకే బోధపడుతుంది. రాజకీయ ముసుగులో తెలుగు భాషాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ…పరితపిస్తున్నట్లూ వ్యవహరిస్తున్న కొందరు కుహనా భాషాభిమానులకు ఈ సమయంలో పేదల తరపున కొన్ని ప్రశ్నలు వేయటం తప్పేమీ కాదేమో..! సమాజంలో నేటి మీ స్థాయికి, హోదాకు..ఇంగ్లిష్‌ కారణం కాదా…? పోనీ ఇక నుంచైనా మీ పిల్లలను ఎయిర్‌ కండిష టెక్నో స్కూల్స్‌ నుంచి తెలుగు వినిపించే, తెలుగు బోధించే ప్రభుత్వ బడులకు మార్చగలరా…? కనీసం చాలా సంవత్సరాలుగా మీ పిల్లలతో మమ్మీ, డాడీ, అంటీ, అంకుల్‌ అని పిలుపించుకోవడానికి ఇష్టపడిన మీరు…ఇక నుంచైనా అమ్మా, నాన్నా, మామయ్య, అత్తయ్య అని పిలిపించుకోగలరా…? ఇవి మీకు సుతారమూ ఇష్టం కాకపోవచ్చు…! మీరూ.. మీ పిల్లలు తెలుగును బ్రతికించేందుకు ఇసుమంతైనా కృషి చేయరు. కానీ, పేదల పిల్లలు మాత్రం కచ్చితంగా తెలుగు మీడియంలోనే చదువుతూ తెలుగు ఉనికిని కాపాడాలని కోరుకుంటారు…! ఇదెక్కడి న్యాయం….! అసలు ఇందులో నైతికత ఎక్కడుంది…?

ప్రభుత్వ బడులే ఎందుకు…?

తెలుగు భాషా అభ్యున్నతి, మనుగడలకు ప్రభుత్వ పాఠశాలలే ఎందుకు కేంద్రాలు కావాలి…? ఇలానే ఎందుకు కోరుకుంటున్నారు..? ఎందుకంటే అక్కడ ఈ కుహనా భాషాభిమానుల పిల్లలు చదవరు కాబట్టి..! ఆయా స్కూల్స్‌లో చదివేవారంతా పేద పిల్లలే కాబట్టి…! ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లిష్‌ చదువులు సాగితే సామాన్యుల పిల్లలు సైతం ధనవంతుల పిల్లలతో పోటీ పడతారు కాబట్టి…! పేదలు సామాజిక, ఆర్థిక, విద్యా విషయాల్లో అభివృద్ధి చెందుతారు కాబట్టి…! ఇలా జరిగితే కుటిల, కుల రాజకీయాలను ప్రశ్నించే శక్తి పేదలకొస్తుంది కాబట్టి…! ఇలా లెక్కమించిన కారణాలతో ఇంగ్లిష్‌ విద్యప్పెడూ పేదలకు అందని ద్రాక్షగానే ఉండాలని ఈ కుహనా భాషాభిమానులు ఆశిస్తున్నారు..ఆశిస్తూనే ఉంటారు…! కానీ, చూస్తుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీరి ఆశలను అడియాశలు చేసేదాకా విశ్రమించేలా కనిపించట్లేదు…!

నిర్బంధ విద్య…!

భారత పార్లమెంట్‌ 2009లో విద్యాహక్కు చట్టాన్ని తీసుకొచ్చి..విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. తద్వారా విద్యను ప్రాథమిక హక్కు చేసిన 135వ దేశంగా గుర్తింపు పొందింది. విద్యాహక్కు చట్టం ద్వారా కేంద్రం ఆరు నుంచి పద్నాలుగేళ్ల వయోవర్గం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలుచేస్తోంది. ఈ చట్టం అమలులో రాష్ట్రాలు సైతం విశేష కృషి చేస్తున్నాయి. దేశంలోని ప్రజలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్రం ఎలాగైతే ప్రత్యేక చట్టం తెచ్చిందో… అదే తరహాలో రాజ్యాంగానికి లోబడి ఇంగ్లిష్‌ బోధన అమలుకు నూతన చట్టం తెచ్చే అవకాశాన్ని జగన్‌ ప్రభుత్వం పరిశీలించాలి. ఎందుకంటే ఆప్షన్‌ విధానంలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడితే…కుటుంబ నేపథ్యం, ఇతరత్రా కారణాల వల్ల పేదల పిల్లలు ఇంగ్లిష్‌ వైపు వెళ్లేందుకు భయపడి వెనక్కుతగ్గే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు సంస్కరణల అమలులో కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు…! ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీం తలుపులు తడతామని ఇప్పటికే చెప్పింది. కాబట్టి త్వరలోనే పేదలకు ఇంగ్లిష్‌ చదువులు పూర్తి స్థాయిలో అందుతాయని ఆశిద్దాం….!