Idream media
Idream media
పేదల ఇళ్లకు కొత్త టెక్నాలజీ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు పథకానికి కొత్త హంగులు సమకూరనున్నాయి. పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో నిర్మించి ఇచ్చే 30 లక్షల ఇళ్లలో గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువ ఉండేలా, విద్యుత్ ఆదా చేసేలా కొత్తగా ఇండో- స్విస్ టెక్నాలజీని అమల్లోకి తేనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే పలుసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగాయి. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అధ్యక్షతన గురువారం జరిగిన వెబ్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన పొదుపు సామర్థ్య సాంకేతికతను నిర్మాణాల్లో వాడాలని నిర్ణయించారు. దీని అమలుపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (బీఈఈ) సంస్థ పూర్తిస్థాయి వివరాలు అందించింది. స్విస్ కాన్ఫెడరేషన్ , బీఈఈలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సహకారంతో రాష్ట్రంలో బిల్డింగ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ ప్రాజెక్ట్ (బీప్) అమలు చేయనున్నారు.
ఎలా పనిచేస్తుంది?
రాష్ట్ర ప్రభుత్వ నిర్మించే ఇళ్లలో లివింగ్ రూమ్, పడక గది, వంట గది, వరండా, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఇంటి నిర్మాణంలో సీలింగ్ దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితమైన ప్రత్యేక మెటీరియల్‌తో నిర్మిస్తారు. దీనివల్ల ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 నుంచి 8 డిగ్రీలు తగ్గుతాయి. అలాగే ఈ టెక్నాలజీ వల్ల పగటి పూట ఇంటిలో వెలుతురు పెరుగుతుంది. ఇంట్లో విద్యుత్‌ను ఆదా చేయగలే ఉపకరణాలనే అమరుస్తారు. ఎల్‌ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు ఉపయోగించడం వల్ల తక్కువ విద్యుత్ బిల్లులు మాత్రమే వస్తాయి. తద్వారా ఒక్కో ఇంటిలో 20 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. ఈ స్విస్ టెక్నాలజీ వల్ల నిర్మాణ వ్యయం కూడా కొంత మేర తగ్గనుంది. దీనివల్ల పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 900 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.