iDreamPost
android-app
ios-app

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా..  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

శనివారం ఉదయం రాష్ట్రంలో జెడ్పిటిసి.. ఎంపిటిసి.. ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం ఒకేదశలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికలు సంఘం స్పష్టం చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. మొదట జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు, తరువాత మున్సిపాలిటీ ఎన్నికలు, ఆతర్వాత పంచాయితీ ఎన్నికలు ఈవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. 

జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంభందించి ఈ నెల 9నుండి 11 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 12 న నామినేషన్ల పరిశీలన, 14 వరకు నామినేషన్ల ఉపసంహరణ, ఈనెల 21 న అన్ని జెడ్పిటిసి, ఎంపిటిసిలకు ఒకేసారి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు.

మున్సిపాలిటీలకు ఈనెల 9 న నోటిఫికేషన్ విడుదల చేసి, 11 నుండి 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14 న నామినేషన్ల పరిశీలన, 16 వరకు నామినేషనల్ ఉపసంహారణ, ఈ నెల 23 న మున్సిపాల్టీలకు ఒకేసారి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించి 27 న ఫలితాలను ప్రకటిస్తారు.

మొదటిదశ పంచాయితీ ఎన్నికలకు సంభందించి ఈనెల 15 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 17 నుండి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 22 నుండి నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 27 వ తేదీ ఎన్నికలు నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటించనున్నారు.

రెండవ దశ పంచాయితీ ఎన్నికలకు సంభందించి ఈనెల 17 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19 నుండి 21 వరకు నామినేషన్ల స్వీకరణ, 24 నుండి నామినేషన్ల పరిశీలన, 26 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 29 వ తేదీ ఎన్నికలు నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటించనున్నారు.

పంచాయితీ ఎన్నికలకు సంభందించి రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. జిల్లా కలెక్టర్లు పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చెయ్యడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లను ఈరోజు సాయంత్రానికి ప్రకటించనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 660 ఎంపీపీ లకు 660 జెడ్పిటీసి లకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 9639 ఎంపీటీసీ ల ఎన్నికలు కూడా ఒకేదశలో పూర్తి చేయనున్నారు. అదేవిధంగా 13 వేలకు పైగా ఉన్న గ్రామపంచాయితీలకు మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు ఎక్కువగా ఉండడం, ఎన్నికల ఫలితాలను కూడా అదే రోజు విడుదల చెయ్యాల్సి ఉండడంతో పంచాయితీ ఎన్నికలను మాత్రం రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పిటీసి ఎన్నికలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు. పంచాయితీ ఎన్నికలకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటలనుండి కౌంటింగ్ నిర్వహించనున్నారు.