Idream media
Idream media
సీఎం వైఎస్ జగన్‌పై ఈనాడు పత్రిక వ్యవహార శైలి మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్ర కవరేజీని ప్రతి రోజూ సింగిల్ కాలమ్‌కే పరిమితం చేసిన ఈనాడు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఇదే పంథాను అవలంభించింది. పైగా వ్యతిరేక వార్తలు పుఖాంనుపుంఖాలుగా వండివార్చింది. అలాంటి ఈనాడు ఇటీవల తన పంథాను పూర్తిగా మార్చివేసింది. టీడీపీకి అనుకూలం, వైసీపీకి వ్యతిరేకం అనే ముద్ర ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఇటీవల వరకు వైఎస్ జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కథనాలు రాశాయి. అయితే ఈనాడు పంథాలో మార్పు రాగా.. ఆంధ్రజ్యోతి ఎప్పటిలాగే నడుస్తోంది.
ఈనాడు వ్యవహార శైలిని ఆది నుంచి గమనించేవారు.. ఈ మార్పుపై పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. పైగా ఈనాడు వ్యవహార శైలి ఇంతేనంటూ లైట్ తీసుకుంటున్నారు. తన అజెండాను అమలు చేసే ప్లాన్‌లో భాగంగానే ఈనాడు పత్రిక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాయడం లేదని, పైగా సీఎం పర్యటన విషయాలు బాగా కవర్ చేస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు, పథకాల అమలులో సమస్యలను ఈనాడు ఉద్దేశపూర్వకంగానే రాయడంలేదని ఈనాడు గత చరిత్రను వివరిస్తున్నారు. తనకు నచ్చని ప్రభుత్వంపై నాలుగేళ్లపాటు స్తబ్ధుగా ఉండే ఈనాడు.. ఎన్నికలకు ఏడాది ఉందనగా.. ప్రత్యేక పేజీలు వేసి మరీ వ్యతిరేక వార్తలు రాస్తుందని గతంలో ఎన్నికలకు ముందు జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. పంచజన్యం పేరుతో ప్రత్యేక పేజీలు వేసి మరీ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లపై వ్యతిరేక వార్తలు రాసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
నిన్న జరిగిన బీసీ సంక్రాంతి సభ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రశంగాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. టీడీపీ నేతలు ఈ కార్యక్రమంపై విమర్శలు చేస్తుండగా.. ఈనాడు మాత్రం వారికి విమర్శలకు కౌంటర్ మాదిరిగా.. సీఎం చెప్పిన అంశాలను వివరంగా రాసుకొచ్చింది. బీసీల నడ్డివిరిచారని, ఈ పదవుల వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదని, బీసీలకు అన్యాయం చేస్తున్నారని.. ఇలా పలురకాలుగా టీడీపీలోని బీసీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిన్నటి నుంచి విమర్శలు చేస్తున్నారు. అయితే వీరి నోళ్లకు తాళం పడేలా ఈనాడు రాసిన వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గత 18 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏ ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం, ఎంత మంది బీసీలకు లబ్ధి జరిగిందీ సీఎం వైఎస్ జగన్ వివరించగా.. వాటిని ఈనాడు సవివరంగా రాసింది. సీఎం వైఎస్ జగన్ పర్యటనల కవరేజ్ ప్రస్తుతం ఇలా ఉన్నా.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ఈనాడు తన పాత పంథాలోనే నడుస్తుందని ఆ పత్రిక శైలిని ఎరిగిన వారు చెబుతున్నారు.
Read Also : ఇది ‘నారాయణ’ ఇజం