iDreamPost
android-app
ios-app

మోదీ ఏడాది పాలనపై వార్తలు.. మరి జగన్‌ పాలనపై వార్తలేవి..?

మోదీ ఏడాది పాలనపై వార్తలు.. మరి జగన్‌ పాలనపై వార్తలేవి..?

తాను నూట్రల్‌ అంటూ పాఠకులను నమ్మించే ఈనాడు పత్రిక సమాయానుకూలంగా ప్రత్యర్థిపై విషం కక్కుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈనాడు నూట్రల్‌ కాదని, పక్కా పచ్చ పత్రికని ఆ పత్రిక పాఠకులకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఏపీలో వైపీసీ అధికారంలోకి రావడంతో ఈనాడు కృత్రిమ ముసుగు తొలగిపోయింది. ప్రభుత్వం కన్నా ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. అయితే మరో రోజు ప్రభుత్వం వార్తలను బ్యానర్‌ చేస్తూ జిమ్మిక్కులు చేస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాదైన సమయంలోనూ, వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలోనూ ఈనాడు వ్యవహరించిన తీరుతో ఆ పత్రిక నిజ స్వరూపం వారి పాఠకులకు పూర్తిగా బోధపడింది.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది అవుతోంది. గత ఏడాది మే 23వ తేదీన ఎన్నికల ఫలితాల్లో అఖండ మెజారిటీ సాధించిన వైసీపీ ఇదే రోజు.. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మొదటి సంతంకంతోనే అవ్వాతాతల పింఛన్‌ నగదును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ నేతన్న హస్తం.. ఇలా అనేక పథకాలకు శ్రీకారం చుట్టి సంక్షేమ పాలన సాగించారు. తాను ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశానని సీఎం జగన్‌ ఇటీవల ప్రకటించారు.

అయితే వైసీపీ ఏడాది పాలనపై ఈనాడు కనీసం ఒక్క కథనం కూడా ప్రచురించలేదు. ఇదే సమయంలో కేంద్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మాత్రం ప్రత్యేకంగా రెండు పేజీలు ప్రత్యేక కథనాలకు కేటాయించారు. ‘మోదీ 2.0 ఏడాది పాలన’ అనే శీర్షికతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలపై ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పలు కథనాలు ప్రచురించింది. దేశ చరిత్రను మలుపుతిప్పిన ఏడాది… దౌత్య విజయం.. లాంటి శీర్షికలతో ఆకాశానికెత్తేసింది. మోదీ ఏడాది పాలన అంటూ రెండు పేజీల వార్తలు రాసిన ఈనాడు.. జగన్‌ ఏడాది పాలన అని కనీసం సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా ప్రచురించలేదు.

అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అయితే.. నాలుగైదు పేజీలు ప్రత్యేకంగా కేటాయించి కథనాలు వండివార్చిన సందర్భాలున్నాయి. ప్రధాన పేజీలోనే కాదు జిల్లా పేజీల్లోనూ.. ఆయా జిల్లాల్లో ఆయా ఏడాదుల్లో జరిగిన అభివృద్ధి.. ప్రజలు పొందిన సంక్షేమ పథకాల వివరాలు, గణాంకాలు, శంకుస్థాపన ఫొటోలతో ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించేవారు. మరి అప్పట్లో ఇలా వ్యవహరించిన ఈనాడు పత్రిక.. వైఎస్‌ జగన్‌ సీఎం అవగానే తన రూట్‌ను మార్చేసింది. అసలు రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఏర్పడింది.. ఏడాది పాలన పూర్తయిందనే విషయం కూడా తమ పాఠకులకు తెలియజేయాలనే కనీసం పత్రిక ధర్మం కూడా పాటించలేదు. తమలాగే తమ పాఠకులకు కూడా రాష్ట్రంలో ప్రభుత్వం మారలేదనో మారినా తమలాగే గుర్తించకూడదనే భావనలో ఈనాడు యాజమాన్యం ఉన్నట్లుగా అర్థం అవుతోంది.