Idream media
Idream media
కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు అన్ని పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు తెలిపారు. పదో తరగతితోపాటు ఇంటర్ ప్రథమ, ద్వితియ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాస్ అయినట్లేనని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులున్నారు.
మార్చి నెలలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అప్పటికే విద్యార్థులందరికీ హాల్ టిక్కెట్లు కూడా జారీ చేశారు. హాల్‌టిక్కెట్లు పొందిన ప్రతి విద్యార్థి పాస్ అయినట్లేనని మంత్రి చెప్పారు. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటించారు. వచ్చే నెలలో పరీక్షలు జరగాల్సి ఉంది. 6 సబ్జెక్టులు 11 పేపర్లుగా జరగాల్సిన పరీక్షను కరోనా కారణంగా ఆరు పేపర్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే కరోనా వైరస్ ఇంకా తీవ్రమవుతుందని వస్తున్న అంచనాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి.