iDreamPost
android-app
ios-app

ప్యాకేజీ పై సామాన్యులకు ఆశలు వద్దు.. సంకేతం ఇచ్చిన నిర్మలమ్మ..

ప్యాకేజీ పై సామాన్యులకు ఆశలు వద్దు.. సంకేతం ఇచ్చిన నిర్మలమ్మ..

కరోనా కష్ట కాలంలో దేశ ఆర్థిక అభివృద్ధి కోసం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి కేటాయింపులు ఉండబోవని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సంకేతాలిచ్చారు. నిన్న మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ కి సంబంధించిన కొన్ని వివరాలను ఈరోజు వెల్లడించారు. 20 లక్షల కోట్లను 15 రకాలుగా కేటాయింపులు చేశామని వెల్లడించిన ఆర్ధిక మంత్రి ఈరోజు సూక్ష్మ, చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు సంబంధించిన కేటాయింపులను వెల్లడించారు. రోజుకు ఒకటి చొప్పున మిగతా అంశాల కేటాయింపులను కూడా వెల్లడిస్తామని తెలిపారు.

ఈ వివరాలన్నీ చెప్పేముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ఇప్పటివరకు తమ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు చేసిన పనులను, ప్రవేశపెట్టిన పథకాలను వల్లె వేశారు. కరోనా ఆపత్కాలంలో దేశంలో 41 కోట్ల జన్ ధన్ ఖాతాలలో 52,606 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. అంతేకాకుండా దేశంలో ప్రజలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున మూడు నెలలకు 15 కేజీల ధాన్యాన్ని అందించామని గుర్తుచేశారు. మొత్తంమీద మూడు నెలల్లో 78 వేల టన్నుల ధాన్యాన్ని ఉచితంగా పంపిణీ చేశామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్యాకేజీ ప్రకటించిన సమయంలో ఈ అంశాలన్నింటినీ తప్పక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మలాసీతారామన్ నొక్కి మరీ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రస్తుత 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ లో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఏమీ ఆశించవద్దని ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. ఇక రాబోయే రోజుల్లో ప్రకటించే ఆర్థిక ప్యాకేజీ లోని మిగతా అంశాలపై కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకుని నిరాశ పడకపోవడమే ఉత్తమమైన మార్గం అని చెప్పవచ్చు.