iDreamPost
iDreamPost
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి మండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఏకైక స్థానానికి జరగబోతున్న ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆమేరకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వచ్చే నెల 6న ఎన్నిక జరగబోతోంది. టీడీపీ అభ్యర్థిని బరిలో దింపుతామని ఇప్పటికే ప్రకటించింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న తరుణంలో ఈసారి మళ్లీ తలబొప్పికొట్టించుకునే నిర్ణయం తీసుకుంటా లేదా అన్నది ఆసక్తికరం. విపక్షం పోటీ చేయకపోతే ఎమ్మెల్సీ సీటు ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం.
వాస్తవానికి ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్న ఏకైక స్థానం డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా కారణంగానే ఖాళీ అయ్యింది. ఆయన టీడీపీ తీరును తప్పుబడుతూ ఆపార్టీని వీడారు. అయితే టీడీపీ నుంచి తనపార్టీలో చేరాలనుకునే వారంతా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని గతంలోనే జగన్ కండీషన్ పెట్టారు. దానికి కట్టుబడి డొక్కా ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాతే వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.
ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ తరుపున ఆయనకే అవకాశం ఇవ్వడం విశేషంగానే చెప్పవచ్చు. వైఎస్సార్సీపీ తరుపున ఎమ్మెల్సీ అనిపించుకోవాలని చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఈసారి తమకే ఛాన్స్ అని కొందరు భావించారు. కానీ జగన్ మాత్రం తన ఆదేశాలకు కట్టుబడిన నేతకే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఎస్సీ లకు రాజ్యసభ సీట్లు కేటాయించలేదని టీడీపీ ఆరోపణలకు దిగిన తరుణంలో ఎస్సీలలో మాదిగ సామాజికవర్గానికే జగన్ సై అన్నారు. చివరకు డొక్కా మళ్లీ మండలిలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం చేశారు. తద్వారా జగన్ తనను నమ్మిన నేతలకు తగిన స్థానం కల్పిస్తారని మరోసారి రుజువు చేసుకన్నారని రాజకీయవర్గాల్లో ఉన్న అభిప్రాయాన్ని బలపరిచేందుకు తోడ్పడ్డారు.