iDreamPost
android-app
ios-app

చంద్రబాబుతో ఉన్న నేతలకు కరోనా.. టీడీపీ అధినేతకు ప్రమాదం లేనట్లేనా..?

చంద్రబాబుతో ఉన్న నేతలకు కరోనా.. టీడీపీ అధినేతకు ప్రమాదం లేనట్లేనా..?

సరిగ్గా మూడు నెలల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసానికే పరిమితం అయ్యారు. కరోనా కారణంగా దాదాపు ఏడాది వరకు ఆయన తన పార్టీని జూమ్‌ యాప్‌ ద్వారా నడిపించారు. కానీ ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. దానికి కారణం ఏమిటి..? వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లనే చంద్రబాబు బయటకు వస్తున్నారా..? ఇంతకూ చంద్రబాబు వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకున్నారు..? ఏ బ్రాండ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు..? అనే చర్చ కొనసాగుతోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్న తరుణంలో మాస్క్‌ కూడా పెట్టుకోవడం లేదు. ఆయన చుట్టూ పార్టీ నేతలు భారీగా ఉంటున్నారు. అందులో కొంత మంది మాస్క్‌ పెట్టుకున్నా.. మరికొంత మంది మాస్క్‌ పెట్టుకోవడం లేదు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారం ప్రారంభించే రోజు తిరుమలకు వెళ్లిన చంద్రబాబుతో.. ఆ పార్టీ నేతలు పలువురు వెళ్లారు. వీరిలో మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సంధ్యారాణిలకు కరోనా సోకినట్లు వార్తలొస్తున్నాయి. కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా.. బాబు తెగించి బయటకు రావడానికి వ్యాక్సిన్‌ తీసుకోవడమే కారణం అయింటుంది.

కరోనా మొదటి వేవ్‌ సమయంలో జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రులు అచ్చెం నాయుడు, రవీంద్రలను పరామర్శించేందుకు చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్, కళ్లకు ప్రత్యేకమైన అద్దాలు, చేతులకు గ్లౌవ్స్‌తోపాటు వైరస్‌ దరిచేరకుండా ఉండేలా చేతిలో ఓ ప్రత్యేకమైన పరికరం పట్టుకునే ఉన్నారు.

Also Read : కరోనా వ్యాక్సిన్ వేసుకొనిరండి.. ఉచితంగా బీరు తాగండి..

నాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే బయటకు వస్తున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తర్వాత రెండో ప్రాధాన్యత కింద వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. అంటే చంద్రబాబు ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్నారని భావించవచ్చు.

అయితే ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఎక్కడా వార్త రాలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌లు వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకున్నారు. కానీ చంద్రబాబు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు బయటప్రపంచానికి తెలియదు. చిన్నపాటి కార్యక్రమానికి మీడియా కవరేజీ కోరుకునే చంద్రబాబు.. తాను వ్యాక్సిన్‌ వేయించుకున్న సందర్భాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దేశీయంగా తయారైన కోవిషీల్ట్, కోవాక్జిన్‌లలో ఏదో ఒక వ్యాక్సిన్‌ను బాబు తీసుకున్నారా..? లేక వీటికన్నా నాణ్యమైన వ్యాక్సిన్‌ ఏదైనా విదేశాల నుంచి తెప్పించుకున్నారా..? విదేశీ వ్యాక్సిన్‌ తీసుకోవడంతోనే ఈ విషయం చంద్రబాబు బయటకు వెళ్లడించలేదా..? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఏం ప‌రిస్థితి తెచ్చావ‌య్యా బాబూ…!