iDreamPost
android-app
ios-app

కోర్టుల విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలు టిడిపికీ వర్తిస్తాయా?

  • Published Jun 01, 2020 | 4:06 AM Updated Updated Jun 01, 2020 | 4:06 AM
కోర్టుల విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలు టిడిపికీ వర్తిస్తాయా?

’ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదు’ … ఇవి తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వాల మీద రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చేందుకే ప్రతిపక్షాలు పిటీషన్లు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా వలసకార్మికుల అంశంపై ప్రతిపక్షాలు సుప్రింకోర్టులో కేంద్రప్రభుత్వంపై కేసు వేశాయి. ఆ సందర్భంగా కేంద్రమంత్రి తన అభిప్రాయాలను చెప్పాడు. పనిలో పనిగా ప్రతిపక్షాల తీరుపైన కూడా కేంద్రమంత్రి తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు.

సరే కేంద్రంలో ఏమి జరుగుతోందన్న విషయాలను పక్కనపెడదాం. రాష్ట్రంలో ఏమి జరుగుతోంది ? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతి చిన్న విషయానికి ప్రత్యర్ధులు కోర్టులో కేసులు వేస్తున్నారు. ఇలా కేసులు వేస్తున్న వారిలో అత్యధికులు తెలుగుదేశంపార్టీ నేతల ప్రోదల్భంతోనే కేసులు వేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదాహరణకు తాజాగా ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయమే చూద్దాం. ప్రభుత్వానికి వ్యతేకంగా కోర్టుకు వెళ్ళదలచుకుంటే రమేష్ కుమార్ కేసు వేయటంలో తప్పు లేదు.

అయితే నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమారు 20 కేసులు దాఖలయ్యాయి. నిమ్మగడ్డను తొలగించినా ఇంకోరిని నియమించినా ఇందులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమే లేదు. ఎన్నికల కమీషనర్ గా ఎవరుంటే జనాలకు ఏమిటి సంబంధం ? అలాంటిది నిమ్మగడ్డకు మద్దతుగా 20 కేసులు ఎందుకు దాఖలయ్యాయి ? ఎందుకంటే దాఖలైన కేసుల్లో అత్యధికం టిడిపినే వేయించిందనే ప్రచారం జరుగుతోంది.

కేసులు వేసిన వాళ్ళలో అత్యధికులు మధ్య తరగతి యువకులేనట. వీళ్ళెకవరికీ ఖరీదైన లాయర్లను పెట్టుకుని కేసులు వేసేంత సీన్ ఉండకపోవచ్చు. అయినా కేసులు వేశారంటే అర్ధమేంటి ? వీళ్ళల్లో అత్యధికుల వెనుక ఎవరో ఉండి వీళ్ళ పేర్లతో కేసులు వేశారన్న విషయం తెలిసిపోతోంది. కేసులు వేసిన వాళ్ళ వెనుక ఎవరున్నారంటే టిడిపినే అనే ఆరపణలు వినబడుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే చాలా నిర్ణయాలను టిడిపి కోర్టుల ద్వారానే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.

నిమ్మగడ్డ విషయాన్ని పక్కనపెడితే ఇంగ్లీషుమీడియం, పంచాయితీ భవనాలకు రంగుల వివాదం, లాక్ డౌన్ సందర్భంలో వైసిపి ఎంఎల్ఏల మీద కేసులు వేయటం, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అంశం, మధ్యం షాపులు తెరవటం, లాక్ డౌన్ ఉల్లంఘనలు, పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణి, మూడు రాజధానుల ప్రతిపాదన, అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళస్ధలాల పంపిణి లాంటి అనేక విషయాల్లో చాలా కేసులు దాఖలయ్యాయి. టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ జగన్ సర్కార్ ఏడాది పాలనలో 70 కేసులు దాఖలయ్యాయని చెప్పాడు. సుమారు 60 కేసుల్లో కోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తీరు మార్చుకోవటం లేదంటూ తీవ్రంగా ఆక్షేపించాడు.

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్ ను ఎలాగైనా నియంత్రించాలని చంద్రబాబు, ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. పరిపాలన విషయంలో జగన్ పై ఒత్తిడి తేవటంలో విఫలమైన ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయంగా కోర్టుల్లో కేసులు వేస్తారన్ననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అభిప్రాయం ప్రభుత్వంలో కూడా ఉంది. ఇదే విషయమై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని అనుకుంటే సాధ్యం కాదన్నాడు.

సో రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యవహారా శైలి చూస్తుంటే ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కోర్టుల ద్వారానే నియంత్రించాలన్న ప్రయత్నాలు అర్ధమైపోతోంది. అంటే రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ప్రత్యేకించి టిడిపికి కూడా వర్తిస్తాయనే అనుకుంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రతిపక్షాల ఆలోచనల్లో మార్పు వస్తుందా ?