iDreamPost
iDreamPost
రాష్ట్ర ఎన్నికల (మాజీ) కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం చివరకు కంచికి సవ్యంగా చేరుతుందా ? లేదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కమీషనర్ తిరిగి నియమితులయ్యే వ్యవహారం పూటకో మలుపు తిరుగుతూ అందరిలోను ప్రత్యేకించి టిడిపి+ఎల్లోమీడియాలో టెన్షన్ పెంచేస్తోంది. టెన్నిస్ కోర్టులో బాల్ ఒకసారి ఒకరి కోర్టులోను ఇంకోసారి మరొకరి కోర్టులోకి ఎలా మారుతుంటుందో ఈ వ్యవహారం కూడా ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య మారిపోతోంది.
హైకోర్టు తీర్పు ప్రకారం ఇటు నిమ్మగడ్డ అటు ప్రభుత్వం ఎవరికి వారుగా తమకే అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నారు. కోర్టు తీర్పు ప్రకారం తానే ఎన్నికల కమీషనర్ ను అంటూ నిమ్మగడ్డ చెబుతున్నాడు. అదే సమయంలో అసలు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను నియమించే అవకాశమే రాష్ట్రప్రభుత్వానికి లేదని హై కోర్టు తీర్పు చెప్పిందంటూ అడ్వకేట్ జనరల్ (ఏజి) శ్రీరామ్ పెద్ద బాంబే పేల్చాడు. సరే మధ్యలో ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా కూడా నిమ్మగడ్డకు అనుకూలంగాను, ప్రభుత్వానికి మద్దతుగాను కథనాలను వండి వార్చేస్తున్నాయి.
సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే కీలకమైన అంశం ఒకటి మిగిలిపోయింది. అదేమిటంటే నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ. నిమ్మగడ్డ పేరుతో కేంద్రహోంశాఖకు అందిన లేఖపై దర్యాప్తు చేయాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిజిపికి ఫిర్యాదు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఫిర్యాదు ఆధారంగా సిఐడి ఇప్పటికే విచారణలో స్పీడు పెంచింది. నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖను నిమ్మగడ్డ తయారు చేయలేదని బయట ఎక్కడి నుండో వచ్చిందని సిఐడి తేల్చింది.
అయితే బయట నుండి వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది ? ఆ లేఖను ఎవరు డ్రాఫ్ట్ చేశారు ? అనే విషయాలు ఇంకా తేలాల్సుంది. ఆ విషయాలపై సిఐడి ఉన్నతాధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ సుప్రింకోర్టులో కూడా కేసు నిమ్మగడ్డకే అనుకూలంగా వచ్చిందని కాసేపు అనుకుందాం. దాంతో ఎలాగూ నిమ్మగడ్డ వెంటనే కమీషనర్ గా చార్జి తీసుకుంటాడనటంలో సందేహం లేదు. అయితే ఆ తర్వాత నిమ్మగడ్డ లేఖ విషయంలో సిఐడి అధికారులు జరిగిన కుట్రను బయటపెడితే ఏమవుతుంది ? నిమ్మగడ్డ మీద, అందులో ప్రమేయం ఉన్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి కదా ? మరి పెడతారా ? అప్పుడు ఎన్నికల కమీషనర్ గా తన మీద కూడా సిఐడి కేసు పెడితే అప్పుడు నిమ్మగడ్డ ఏమి చేస్తాడు ?
లేఖను డ్రాఫ్ట్ చేసిన వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టినా వాళ్ళకు పోయేదేమీ లేదు. అలాగని వచ్చేదేమీ కూడా లేదు కాబట్టి కేసులపై వాళ్ళు పోరాటం చేస్తారు. ఎందుకంటే ఇదంతా రాజకీయ వ్యవహారం కాబట్టి. కానీ నిమ్మగడ్డ వ్యవహారం అలా కాదు కదా ? కేసంటు పెట్టిన తర్వాత సిఐడి పోలీసులు అరెస్టులు కూడా చేస్తారు. ఎందుకంటే కేంద్ర హెంశాఖకు వెళ్ళిన లేఖలోని అంశాలు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేట్లుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నిన వాళ్ళని అరెస్టులు చేసి చర్యలు తీసుకోవాలని సిఐడి అనుకుంటే అప్పుడు నిమ్మగడ్డ కథ ఎక్కడికి చేరుతుంది ?