iDreamPost
iDreamPost
ఇద్దరు టిడిపి ఎంఎల్సీలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా ? శాసనమండలి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనే ఇదే అనుమానం పెరిగిపోతోంది. శాసనమండలిలో రెండు అంశాలకు సంబంధించి జరిగిన ఓటింగ్ లో పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలంటూ కౌన్సిల్లో పార్టీ విప్ బుద్ధా వెంకన్న ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు ఫిర్యాదుచేశాడు. ఆ నోటీసును బేస్ చేసుకుని ఛైర్మన్ ఆదేశాల ప్రకారం మండలి కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు ఎంఎల్సీలు సిహెచ్. శివనాధరెడ్డి, పోతుల సునీతకు గురువారం నోటీసిచ్చాడు. ఇది వరకే రెండు నోటీసులు వెళ్ళాయి. అంటే తాజాగా వెళ్ళిన నోటీసు మూడోదన్నమాట.
సరే వాళ్ళేమీ సమాధానం ఇస్తారన్నది వేరే సంగతి. మొన్నటి జనవరి 22వ తేదీన సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులపై మండలిలో చర్చ జరిగింది. అయితే ఆ చర్చ సందర్భంగా మండలిలో జరిగిన గలబా అందరికీ తెలిసిందే. గందరగోళం మధ్యనే ఛైర్మన్ రెండు బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఛైర్మన్ చేసిన ప్రకటన కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికార వైసిపి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయమై రెండు పార్టీల మధ్య ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. ఛైర్మన్ కు ప్రభుత్వానికి మధ్య యుద్ధమే మొదలైంది.
ఈ గొడవ ఇలా సాగుతుండగానే ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సెలక్ట్ కమిటి ఏర్పాటు మీద రెండు పార్టీల మధ్య చాలా వివాదాలు రేగాయి. సెలక్ట్ కమిటి గొడవ బాగా పెరిగిపోవటంతో చివరకు శాసనమండలినే రద్దు చేసేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేయటం తర్వాత జరిగిన సమావేశాల్లో అసెంబ్లీలో పాసవ్వటం అందరు చూసిందే. ఆ తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో అన్నీ పార్టీలు బిజీ అయిపోయాయి. ఇదే నేపధ్యంలో బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశలు పెట్టాల్సొచ్చింది.
ఒకవైపు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బిజీగా ఉన్న సమయంలోనే హఠాత్తుగా కరోనా వైరస్ సంక్షోభం మొదలైంది. దాంతో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించేసింది. అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. ఈ సమయంలోనే అనర్హత వేటుకు సంబంధించి మండలి ఛైర్మన్ ఆదేశాలతో పై ఇద్దరు ఎంఎల్సీలకు నోటీసులు వెళ్ళాయి. అంటే బయట ఎన్ని డెవలప్మెంట్లు జరుగుతున్నా టిడిపి మాత్రం ఛైర్మన్ ను అడ్డుపెట్టుకుని ఇద్దరు ఎంఎల్సీలపై అనర్హత వేటు వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బుద్ధా వెంకన్న చెప్పినట్లుగా అసలు మండలిలో బిల్లులపై ఓటింగే జరగలేదు. జరగని ఓటింగ్ జరిగినట్లు చెప్పి ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలంటూ ఎలా ఫిర్యాదు చేశాడో అర్ధం కావటం లేదు. బుద్ధా అంటే పార్టీ చెప్పినట్లు చేశాడనే అనుకుందాం. ఛైర్మన్ కు ఏమైంది ? సభలో అసలు ఓటింగే జరగలేదని ఛైర్మన్ కు బాగా తెలుసు కదా ? ఓటింగే జరగనపుడు ఇక విప్ ధిక్కరించే సమస్యే లేదుకదా ?
ఇక్కడ విషయం ఏమిటంటే ఛైర్మన్ ఎంఏ షరీఫ్ టిడిపి నేత అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నాడు. ఇవన్నీ గ్రహించే అసలు శాసనమండలినే రద్దు చేసేందుకు జగన్ పావులు కదిపాడు. దాంతో చంద్రబాబు, షరీఫ్ అండ్ కో జగన్ పై మండిపోతున్నారు. ఇందులో భాగంగానే మండలి రద్దయేలోగానే టిడిపి ఎంఎల్సీలను అనర్హులను చేసి కసి తీర్చుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యాడు. దానికి అనుగుణంగానే షరీఫ్ కూడా ఆడుతున్నాడు. ఈ గేమ్ లో భాగంగానే జరగని ఓటింగ్ జరిగినట్లు అనర్హత నోటీసు ఇవ్వటం, ఛైర్మన్ వాళ్ళకు నోటీసులిప్పించాడు.
జరుగుతున్నది చూస్తుంటే పై ఇద్దరు ఎంఎల్సీల అనర్హతకు రంగం సిద్ధమైనట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే విచారణకు వాళ్ళు హాజరైనా కాకపోయినా వాళ్ళపై ఛైర్మన్ అనర్హత వేటు వేసేందుకే అవకాశాలున్నాయి. ఛైర్మన్ నిర్ణయాన్ని వాళ్ళు కోర్టులో సవాలు చేసుకోవటం వేరే విషయం. అసలు ఈలోగానే మండలి రద్దుకు పార్లమెంటు గనుక నిర్ణయం తీసేసుకుంటే అసలు సమస్యే ఉండదు. కానీ అదంత తొందరగా జరుగుతుందా ?