iDreamPost
android-app
ios-app

వైఎస్సార్ సీపీ ఆశలు ఫలిస్తాయా..?

వైఎస్సార్ సీపీ ఆశలు ఫలిస్తాయా..?

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ క్యాబినెట్ తీర్మానించి వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించింది. మంచి సలహాలు ఇస్తుందని ఏర్పాటు చేసుకున్న మండలిని రాజకీయాలకు వాడుకుంటున్నారనే కారణంతో క్యాబినేట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని అసెంబ్లీకి పంపింది.

అయితే ఏపీ మండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో ఎగువసభగా గుర్తింపు పొందింది. విధాన పరిషత్తు 1958 నుండి 1985 మరియు 2007 నుండి ఇప్పటివరకూ రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం 58 మంది సభ్యులతో ఉండగా ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో 55 మందే మండలి సభ్యులుగా ఉన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో ఏపీ శాసనమండలి పనిచేసింది. ఏపీలో శాసనమండలికి సుదీర్ఘ చరిత్ర ఉంది. జులై 1, 1958న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఏర్పాటైంది. రాజ్యాంగంలోని 168 అధికరణం కారణంగా 1968 జూలైన అప్పటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్ మండలిని ప్రారంభించారు.

1983 వరకూ కాంగ్రెస్‌ పాలనలో శాసససభ, మండలి కార్యకలాపాలు సజావుగానే సాగాయి. 1983లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత మండలిని ఆరో వేలుగా వర్ణిస్తూ అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో ఏప్రిల్ 30, 1985న మండలిని రద్దు చేస్తూ తీర్మానించారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయ సభల్లోనూ ఆమోదించగా దీనిపై 1985 జూన్‌1న రాష్ట్రపతి సంతకం చేయడంతో ఈతీర్మానాన్ని పార్లమెంటుకు పంపగా రెండు సంవత్సరాలకు పార్లమెంటులో ఆమోదింపబడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దయింది.

అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మండలి పునరుద్ధరణకు ప్రయత్నించింది. 1990 జనవరి 22న శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈబిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును పట్టించుకోలేదు.

మళ్లీ 2004లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ మండలి పునరుద్ధరణ దిశగా అడుగులు పడ్డాయి. 2004 జూలై8న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. దాంతో 2004 డిసెంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశ పెట్టబడింది. దీన్ని 2006 డిసెంబరు 15న లోక్‌సభ ఆమోదించింది. ఆ వెంటనే డిసెంబర్ 20న రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోదం పొందింది. దాంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తిరిగి 2007 మార్చి 30న ఏర్పాటైంది. అప్పటి గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ మండలిని ప్రారంభించారు.

అలా ప్రారంభమైన మండలి రద్దు ప్రక్రియ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో మరోసారి రద్దు దిశగా వెళ్తోంది. మండలిని రద్దుచేస్తూ జగన్ సర్కార్ శాసనసభలో ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. శాసనసభ సచివాలయం నుంచి బిల్లులకు సంబంధించిన అంశాలను అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి పంపింది. కేంద్ర న్యాయశాఖతో పాటు హోంశాఖకు ఈ తీర్మానం అందింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇందుకు సంబంధించిన ప్రతిని పంపింది. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్రపతి కూడా ఆమోదించి, నోటిఫికేషన్‌ జారీ చేస్తే మండలి రద్దు అవుతుంది.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలు పార్లమెంట్ జరుగుతున్న తీరుతో ఏపీ శాసనమండలి రద్దు బిల్లు సభల్లోకి వస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఢిల్లీ అల్లర్లు, సీఏఏ, ఎన్నార్సీ వివాదంతో పాటుగా కేంద్రానికి కొన్ని ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో మండలి రద్దు అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కచ్చితంగ మండలి రద్దు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందుతుందని వైసీపీ శ్రేణులు చెప్తుండగా.. మండలి రద్దు అంత సులభం కాదని టీడీపీ నేతలంటున్నారు. కౌన్సిల్ రద్దు చేయడానికి చాలా ప్రక్రియ ఉందని, పార్లమెంటు నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యమవుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ ప్రక్రియకు కనీసం ఏడాది సమయం పడుతుందని యనమల వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేస్తామంటు భయపడేది లేదని, దీనిపై జాతీయస్థాయిలో పోరాడతామని టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్‌ అన్నారు.