Idream media
Idream media
జనరల్ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. ఈ ఎన్నికల్లో స్థానిక నేతలు పోటీలో ఉంటారు కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తమ పంచాయతీ, ఎంపీటీసీ పరిధిలో పక్క గ్రామాల వారు పెత్తనం చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. బయట ప్రాంతాల వారు వస్తే ఊరుకుంటారా..? సొంత పార్టీ నేతలు వచ్చినా స్థానిక నేతలు ఒప్పుకోరు. అలాంటిది.. గుంటూరు జిల్లాలో ఓ మూలన ఉన్న మాచర్ల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ కోసమంటూ.. కృష్ణా జిల్లా నేతలైన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపడం సరైన పనేనా..? అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు.
స్థానికేతరులైన వెంకన్న, బొండా ఉమాలను పంపే బదులు వారి స్థానంలో గుంటూరు జిల్లా నేతలను పంపించి ఉంటే.. నిన్న మాచర్ల ఘటన జరిగేదేకాదని ఘంటా పథంగా చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ అనేదే చంద్రబాబు లక్ష్యమైతే మాచర్ల పక్కనే ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు హోం మినిస్టర్‌గా పేరుగాంచిన యరపతినేని శ్రీనివాసరావునో, లేదా ఆ పార్టీ లోక్‌సభ ఇన్‌ఛార్జి రాయపాటి సాంబశిరావునో పంపించి ఉండాలి. వీరు కూడా కాదనుకుంటే… గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులను పంపాలి. జీవీ ఆంజనేయులది మాచర్ల పక్క నియోజకవర్గమే. వీరితోపాటు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎలాగూ ఉన్నారు. వీరందరినీ కాదని ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీని, ఓ మాజీ ఎమ్మెల్యేను పంపారు. గుంటూరు జిల్లా నేతలు కంటే.. బుద్ధా వెంకన్న, బొండా ఉమా మహేశ్వరావులు బలమైన వారా..?
ఇటీవల గుంటూరు జిల్లా ఖాజా టోల్ ప్లాజ వద్ద మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. వైఎస్సార్‌సీపీ, సీఎం వైఎస్ జగన్‌లపై తరచూ నోరుపారేసుకుంటున్న బొండా ఉమా, బుద్ధా వెంకన్నలను మాచర్ల పంపితే.. వారిపై దాడి జరిగే ప్రమాదం ఉంటుందనేది ఎవరైన ఊహించగలరు. ఇది తెలిసి కూడా వారిరువురిని చంద్రబాబు పంపడం వెనుక మరేదైనా లక్ష్యం ఉందేమోన్న అనుమానాలు కలిగేలా టీడీపీ అధినేత వ్యవహరించారని చెప్పవచ్చు.
గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్న మాచర్ల గత చరిత్ర, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉన్నదీ చంద్రబాబుకు బాగా తెలుసు. అక్కడ పరిస్థితి, గత చరిత్రపై గుంటూరు జిల్లా ఎస్పీకి చెప్పి… భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని కోరానంటూ… ప్రెస్ మీట్‌లో చంద్రబాబు చెప్పారు. మరి అక్కడ ఉద్రిక్త పరిస్తితులుంటాయి, దాడులు జరుగుతాయని ఎస్పీకి చెప్పిన చంద్రబాబు.. పక్క జిల్లా నేతలను ఎన్నికల పర్యవేక్షణ పేరుతో అక్కడకు పంపడంలో తర్కమే లేదు. ఒక వేళ పంపినా.. స్థానిక నేతలతో కలసి వెళ్లేలా చూసినా.. మాచర్ల ఘటన జరిగేది కాదు.
ఓటమి ఎలాగూ తప్పదు కాబట్టి.. వైఎస్సార్‌సీపీ విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు అక్కడక్కడా కార్యకర్తల మధ్య జరుగుతున్న గొడవలను టీడీపీ బూచిగా చూపిస్తోందని అధికార పార్టీ నేతలు విమర్శలు చేసే అవకాశం నిన్న జరిగిన మాచర్ల ఘటన ఇచ్చింది. ఏమైనా మాచర్లలో జరిగిన ఘటనలు ప్రజా స్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వాళ్ల హయాంలో దాడులు చేశారు కాబట్టి.. ఇప్పుడు మేమూ చేస్తామనడం అర్ధరహితం. ప్రతిపక్షం కన్నా అధికార పార్టీ కార్యకర్తలే ఎక్కువ సంయమనంతో ఉండాలి. లేదంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిపైనా ఆ ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు.