iDreamPost
iDreamPost
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే చంద్రబాబునాయుడు పదవికి మూడినట్లే అనిపిస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబే వస్తాడు. ఆ తర్వాతే మంత్రుల వస్తారు. ఇంతటి కీలకమైన పోస్టు తొందరలో చంద్రబాబుకు దూరమైపోతుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది.
ఇంతకీ ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలకు వైసిపి గాలమేస్తోందంటూ ఎల్లోమీడియాలోనే వచ్చింది. టిడిపి ఎంఎల్ఏలతో వైసిపి నేతలు మాట్లాడుతున్నారని ఎల్లోమీడియా చెప్పింది. దక్షిణ కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంఎల్ఏలతో వైసిపిలో నెంబర్ 2గా చెలామణి అవుతున్న నేత మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం ఇచ్చింది. మహానాడు ప్రారంభమయ్యే గురువారం నాడే ఇద్దరు ఎంఎల్ఏలను లాక్కునేందుకు వైసిపి వ్యూహాం పన్నుతున్నట్లు కూడా వివరించింది.
ఒకవైపు ఇద్దరు ఎంఎల్ఏలపై వైసిపి కన్ను పడిందని ఎల్లోమీడియా చెబితే తొమ్మిది ఎంఎల్ఏలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే చంద్రబాబుకు ఇపుడున్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోవటం ఖాయం. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం ఎంఎల్ఏల సంఖ్యలో 10వ వంతు ఎంఎల్ఏల బలం ఉండాలి. ఈ లెక్క ప్రకారం 175 ఎంఎల్ఏల్లో పదోవంతంటే 17 మంది బలం ఉండాలి.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున 23 మంది గెలిచారు. తర్వాత పరిణామాల్లో ముగ్గురు ఎంఎల్ఏలు దాదాపు దూరమైపోయినట్లే. అంటే ఇక ఉన్నది 20 మంది మాత్రమే. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఎంఎల్ఏల బలం 17కన్నా తగ్గకూడదు. కానీ సోషల్ మీడియాలో ప్రచారం ప్రకారం తొమ్మిది మంది ఎంఎల్ఏలు బయటకు వచ్చేయటానికి రెడీగా ఉన్నారు. అంటే చంద్రబాబుకు ఇపుడున్న ప్రోటోకాల్ జారి పోవటం ఖాయమనే అనుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా తొమ్మిది మంది కాకపోయినా మరో నలుగురు ఎంఎల్ఏలు పార్టీ నుండి బయటకు వచ్చేసినా కూడా చంద్రబాబుకున్న పదవి గోవిందా ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే పద్దతిలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నించాడు. 2014లో వైసిపి తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 23 మందిని చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంత ప్రయత్నించినా జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చంద్రబాబు చేయలేకపోయాడు. అప్పట్లో చంద్రబాబు చేసిన ప్రయత్నాలే ఇపుడు చంద్రబాబుకు ఎదురవ్వబోతోందన్నమాట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.