iDreamPost
android-app
ios-app

‘సోము’కు ఫ్రీ హేండ్‌ ఇచ్చేసారా..?

  • Published Sep 29, 2020 | 1:26 AM Updated Updated Sep 29, 2020 | 1:26 AM
‘సోము’కు ఫ్రీ హేండ్‌ ఇచ్చేసారా..?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించిన బీజేపీ అధిష్టానం, రాష్ట్రంలో పలు నిర్ణయాల విషయంలో ఆయనకే ఫ్రీ హేండ్‌ ఇచ్చేసారని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీలో తనదైన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారని చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సమృద్దిగా ఉండి, రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు బీజేపీలోనే ఉన్న సోము వీర్రాజు కృషి, పట్టుదలను మళ్ళీమళ్ళీ నిరూపించుకోవాల్సిన ఆగత్యం లేదు.

అయితే ఏపీలో మంచి స్థాయికి చేరాలంటే భారీ కసరత్తే అవసరపడుతుంది. వ్యూహంలో భాగంగా అవసరైన క్రౌడ్‌పుల్లింగ్‌కు ప్రధాన అండగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాగూ ఉన్నాడు. ఇక జనంలోకి చొచ్చుకుపోయే క్రమంలో సోము వీర్రాజుకు సొంత పార్టీ నాయకుల నుంచే ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్తగానే బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తోందన్నది ఇటీవల ప్రకటించిన జాతీయ కమిటీతో తేటతెల్లమైపోయిందంటున్నారు.

ఇక్కడ ఇప్పటి వరకు బీజేపీ తరపున చక్రం తిప్పిన వారిని పక్కన పెట్టి సోము వీర్రాజుకు కావాల్సిన టీమ్‌ను ప్రిపేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారని చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొద్దోగొప్పో ప్రభావం చూపుతారనుకున్న నాయకుల్ని కూడా కేంద్రకమిటీ పేరుతో అధిష్టానం తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు. తద్వారా సోము వీర్రాజుకు ఏపీలో అడ్డంకులు ఎదురయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ముందుచూపుతో వ్యహరించారంటున్నారు.

గతంలో కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా హడావిడి చేసిన వారెవ్వరూ కూడా ఇప్పుడు సోము హయాం ప్రారంభమయ్యాక తెరపై కన్పించడం లేదు. ఇందుకు అధిష్టానం అనుసరించి వ్యూహమే కారణమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరినీ నేరుగా అదుపు చేయకుండానే సోము చేతికి విస్తృత అధికారాలు ఇవ్వడం ద్వారా అటువంటి వారందరినీ కట్టడి చేయగలిగారంటున్నారు. ఇదే ధోరణిని కొనసాగించే క్రమానికి బీజేపీ అధిష్టానం కట్టుబడ్డ సంకేతాలున్నాయని వివరిస్తున్నారు.

ఏపీలో తమదైన స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు వేస్తున్న సోము వీర్రాజు స్ట్రాటజీపై పూర్తిస్తాయిలో నమ్మకం ఉండబట్టే ఆయనకు ఈ స్థాయిలో అవకాశం ఇచ్చారన్న వాదనలు కూడా ఉన్నాయి. నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు నోటాతోనే పోటీపడ్డారని రాజకీయవర్గాల్లో టాక్‌నడుస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధుల్లో ఒక్కరిక్కూడా డిపాజిట్లు దక్కినదాఖలాల్లేవు. మొత్తం పోలైన ఓట్లతో పోలిస్తే బీజేపీకి కేవలం 0.84 శాతమే ఓట్లు దక్కినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 173 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు పోటీ చేస్తే వారంతా కలిసి సాధించిన ఓట్లు 2.64లక్షలు మాత్రమే.

ఇక జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు మొత్తం పోలైన ఓట్లలో ఏడు శాతంగా ఉంటుందని లెక్కగట్టారు. అంటే ఈ రెండు పార్టీలను కలిపినాగానీ 7.84మాత్రమే అవుతోంది. ఈ లెక్కన ఏపీలో పార్టీని కనీసం ‘పోటీ’కి నిలపడం సోము వీర్రాజుకు కత్తిమీద సాములాంటిదే. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒకే ఒక్క బలం తప్పితే నేరుగా కనిపించే బలం ఏమీ లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే సోముకు ఫ్రీ హేండ్‌ ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి బీజేపీ అధిష్టానం కట్టుబడి ఉందన్నది ప్రస్తుత కార్యవర్గ ప్రకటనలతో తేలిందని వివరిస్తున్నారు. అధిష్టానం నమ్మకాన్ని నిలిపే విధంగా భవిష్యత్తులో సోము వీర్రాజు ఏ విధమైన వ్యూహాలు పన్నుతారో కాలమే తేల్చాల్సి ఉంది.