iDreamPost
iDreamPost
మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటుందంటే మూడు అంశాలే ప్రధానంగా ఉంటుంది. మొదటిది పార్టీ ప్రస్తుత బలం ఏమిటి ? బలహీనత ఏమిటి ? అనే విషయాలపై చర్చలు జరుగుతుంది. ఇక రెండో అంశం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పటికీ ఓడిపోయామంటే అందుకు కారణాలు ఏమిటి ? అనేది. చివరగా మూడో అంశం ఏమిటంటే మళ్ళీ భవిష్యత్తులో బలపడాలన్నా అధికారంలోకి రావాలన్నా తీసుకోవాల్సిన చర్యలేమిటి ? అనే విషయాలపై నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటుంది. కానీ మహానాడులో జగనే టార్గెట్ అవుతాడని అందరూ ఊహించిందే. కానీ ఎవరు మాట్లాడినా జగనే సెంటర్ పాయింట్ అవుతాడని మాత్రం అనుకోలేదు.
కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే బుధవారం మొదలైన రెండు రోజుల మహానాడులో పై అంశాల గురించి ఎక్కడా మచ్చుకి కూడా చర్చలు జరగలేదు. మహానాడు మొదలైన దగ్గర నుండి ఎవరు మాట్లాడినా ఒకటే పాయింట్. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటం, ఆరోపణలు చేయటం. సరే జగన్ ఏడాది పాలనంతా అవినీతి, అక్రమాలు, అరాచకాలు ఇలా.. ఏఏ పదాలున్నాయో అన్నింటినీ వాడేశారు. రాజకీయాలన్నాక ప్రతిపక్షాలపై దుమ్మెతిపోయటమే ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంటాయనటంలో సందేహం లేదు.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు పాలన మొత్తం బ్రహ్మాండంగా జరిగిందని చప్పుకోవటమే. పంచుమర్తి అనూరాధ, బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావు, ఎల్. రమణ ఇలా.. ఎవరు మాట్లాడినా చంద్రబాబు పాలనలోనే జనాలు పిచ్చ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. 214-19 మధ్యలో కూడా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, రైతులు, మహిళలు ఏ వర్గం తీసుకున్నా చంద్రబాబు పాలనలో పూర్తి సంతోషంతో ఉన్నట్లు చెప్పుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడి పాలన గురించి పొగడటంలో నేతలు ఒకిరిని మించి మరొకరు పోటీ పడటం స్పష్టంగా తెలిసిపోతోంది.
అయితే నేతలందరూ మరచిపోయిన విషయం ఒకటుంది. సమాజంలోని ప్రతి వర్గమూ చంద్రబాబు పరిపాలనలో పిచ్చ హ్యాపీగా ఉంటే మరి మొన్నటి ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినట్లు ? పార్టీ పెట్టినప్పటి నుండి అంటి పెట్టుకుని ఉన్న బిసిల్లో కూడద చీలిక ఎందుకు వచ్చింది ? 2014లో గంపగుత్తగా టిడిపికి మద్దతిచ్చిన అనేక వర్గాలు మొన్నటి ఎన్నికల్లో ఎందుకు వ్యతిరేకమయ్యారన్న విషయాన్ని నేతలు ఆలోచించుకోవాలి.
అధికారంలో ఉన్నపుడు బ్రహ్మాండంగా పాలన చేశామని, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మనమే బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారంటే చంద్రబాబుతో కలిసి నేతలంతా తమను తాము మోసం చేసుకుంటున్నట్లే లెక్క. బలము, బలహీనతల విషయంలో నిజాయితీగా చర్చలు జరపుకోవాలి. అలాగే జనాలు ఎందుకు అంత కసిగా వ్యతిరేకంగా ఓట్లేశారనే విషయంపై చర్చించకుండా జగన్ను తిట్టటం కోసమే మహానాడు నిర్వహించుకునేట్లయితే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చోవటం ఖాయమనే అనిపిస్తోంది.