Idream media
Idream media
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఈ రోజు విశాఖ 4వ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ జరిగిన దానికి భిన్నంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కారులో వెళుతుంటే అల్లరిమూకలు తనను బెంబడిచాయని సుధాకర్ చెప్పారు. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని, మోడీని, జగన్‌ను తిట్టాల్సిన అవసరం ఏముందన్నారు. సీఎం జగన్ తనకు దేవుడని కొనియాడారు. మోదీ అంటే ఇష్టమని, జగన్ అయితే పేదలకు మంచి పనులు చేస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు వద్దకు వెళ్లడమే తాను చేసిన తప్పన్నారు.
తనకు పార్టీ అంటూ ఏమీలేదన్నారు. చంద్రబాబు కార్యకర్తను అయితే కాదన్నారు. ఎవరికో చెడ్డపేరు తెచ్చేందుకే తనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు. పిచ్చొడని ముద్రవేసి తన జాబ్ తీసేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. తనకు గుండు గీసింది ఎవరో చెప్పలేనన్నారు. చెబితే మళ్లీ గొడవ అవుతుందన్నారు. సీఎం జగన్ తనను క్షమించి తన ఉద్యోగం తనకు ఇస్తే చాలన్నారు. జీతం రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయన్నారు. వాటిని చూసుకునేందుకే సమయం చాలడంలేదని, అలాంటిది రాజకీయాలతో తనకు పనేంటని..? ప్రశ్నించారు. రాజకీయం అంటేనే అసహ్యమని, ఉద్యోగమే ముఖ్యమని సుధాకర్ పేర్కొన్నారు.
ఇన్ని రోజులు హడావుడి చేసిన మత్తు డాక్టర్ సుధాకర్ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో అందరూ ఆశ్యర్యానికి గురవుతున్నారు. జగన్ దేవుడు, మోదీ అంటే ఇష్టం.. అని మాట్లాడిన సుధాకర్.. గతంలో వారిని ఎందుకు దూషించారో కూడా చెబితే బాగుండేది. మద్యం మత్తులో దూషించడడం ఎందుకు..? తీరిగ్గా క్షమాపణలు చెప్పడం ఎందుకు..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా హడావుడి చేయడం, ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి రచ్చ చేయడం వెనుక ఉద్దేశాలు కూడా సుధాకర్ చెబితే ఆయన మాటలు విశ్వసించవచ్చు. పనిలో పనిగా ఈ వ్యవహారంలో తెర వెనుక జరిగిన కథ కూడా బయటపెట్టి తాను సఛ్చీలుడునని నిరూపించుకోవచ్చు.
ఓ పక్క తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూనే సుధాకర్.. కొత్త వివాదాలకు తన మాటల ద్వారా ఈ రోజు బీజం వేశారు. తనకు గుండు ఎవరు చేశారో చెప్పనంటూ.. కొత్త సందేహాలకు తావిచ్చారు. గుండు చేసింది ఎవరో చెబితే మళ్లీ గొడవలు అవుతాయని ఎవరూ అడగకుండానే.. తనకు గుండు చేశారని చెప్పాలని ప్రయత్నించారు. గుండు తాను చేయించుకున్నాడా..? లేదా ఎవరైనా చేశారా..? అనే ప్రశ్న ఇప్పటి వరకూ ఉత్పన్నం కాలేదు. కానీ ఇప్పుడు గుండు వెనుక కథ గురించి ట్రైలర్ వేసి.. అసలు సినిమా ఇంకా ఉందనేలా సరికొత్త ఉత్కంఠను రేపారు.
సుధాకర్ మాటల్లో నిజం లేదని ఆయన మాటలు గమనిస్తే తెలుస్తోంది. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏదో లక్ష్యంతో తనకు తానుగా లేదా తనకు తెలియకుండా.. రాజకీయాల్లో పావుగా మారారు. సీబీఐ రాకతో కథ అడ్డం తిరిగి తనపైనే కేసు నమోదు కావడంతో అసలు విషయం బోధపడింది. అందుకే ఇప్పుడు రాజకీయాలు నాకొద్దు.. రాజకీయాలంటే అసహ్యం అనే మాటాలు వల్లెవేస్తున్నారు. పైగా జీతం రాక ఇబ్బంది పడుతున్నానంటూనే.. తనకు వందల ఎకరాల పొలాలు ఉన్నాయంటూ.. తాను ఎంత ఆస్తి పరుడునో చెబుతున్నారు. ఈ రెండు మాటాలకు ఏమాత్రం పొంతన కుదరడంలేదు. మొత్తం మీద యూ టర్న్ తీసుకున్న సుధాకర్ విషయం ఎక్కడ ముగుస్తుందో వేచి చూడాలి.