Idream media
Idream media
కరోనా వైరస్ నియంత్రణ విధులు నిర్వర్తిస్తున్న తహసిల్దార్, మరో ముగ్గురు ప్రభుత్వ డాక్టర్లు, ముగ్గురు నర్సులకు కరోనా వైరస్ తో అనంతపురంలో తీవ్ర అలజడి నెలకొంది. అనంతపురం జిల్లా హిందూపురంలో కరోనా రెడ్ జోన్ లో ఉన్న ప్రాంతంలో సదరు డాక్టర్ నివాసముంటున్నారు. ఆయన డ్రైవర్ ద్వారా ఈ వైరస్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. ఆయన తోపాటు ముగ్గురు వైద్యాధికారులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో వీరందరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారందరిని గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు. దాదాపు 300 మంది ఈ వీరితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.
కరోనా వైరస్ సోకిన తహసిల్దార్ను అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరామర్శించారు. రక్షణ సూట్ ధరించిన కలెక్టర్ గంధం చంద్రుడు.. తహసిల్దార్ వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్ సోకడానికి గల కారణాలను విచారించారు. వైరస్ సోకిన అంతమాత్రాన అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కొద్ది రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుంటారని తహసిల్దార్, డాక్టర్లు, నర్సులకు ధైర్యం చెప్పారు.
తాజా ఘటన ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తుంది. నిత్యం అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు పాటిస్తున్న అధికారులకు కూడా కరోనా వైరస్ సోకింది అంటే సామాన్య ప్రజానీకం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంటికి కనిపించని కరోనా వైరస్ ఎటు నుంచి ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ.. బయటికి వెళ్ళినప్పుడు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న పాటి నిర్లక్ష్యం తమతోపాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎంతో ప్రమాదమని తాజా ఘటన తెలియజేస్తోంది.