iDreamPost
android-app
ios-app

పుట్టిన రోజునాడే…కరోనాతో మ‌ర‌ణించిన డిఎంకె ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్

పుట్టిన రోజునాడే…కరోనాతో మ‌ర‌ణించిన డిఎంకె ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తో డిఎంకె ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్ కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనీస్వామి ట్విట్టర్‌లో ప్రకటించారు. అన్బ‌ళ‌గ‌న్ ప్ర‌స్తుతం చేప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే అన్బ‌ళ‌గ‌న్ మ‌ర‌ణించారు. క‌రోనా సోకి ఒక శాస‌న స‌భ్యుడు మ‌ర‌ణించ‌డం దేశంలో ఇదే ప్ర‌థ‌మం.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్ మృతి పట్ల డిఎంకె పార్టీ అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. అన్బ‌ళ‌గ‌న్ కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నీ స్వామి, డిఎంకె ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేత‌లు సంతాపం తెలిపారు. 62 ఏళ్ల వయసు గల అన్బ‌ళ‌గ‌న్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిఎంకె వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపౌక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్బ‌ళ‌గ‌న్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001 లో టి నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి మొదటిసారి అన్బ‌ళ‌గ‌న్ ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 2011, 2016లలో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. డిఎంకె వ్య‌వ‌స్థాప‌కుడు క‌రుణానిధికి, డిఎంకె అధ్య‌క్షుడు స్టాలిన్ కు అన్బ‌ళ‌గ‌న్ అత్యంత స‌న్నిహితుడు.

కరోనా వైరస్ సోకిన అన్బ‌ళ‌గ‌న్ జూన్ 2వ తేదీన రేలా ఆసుపత్రిలో చేరారు. ఇతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆక్సిజన్ థెరపీ ప్రారంభించారు. ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఎమ్మెల్యే అన్బ‌ళ‌గ‌న్ కన్నుమూశారు. అన్బ‌ళ‌గ‌న్ త‌మిళ న‌టుడు జ‌యం ర‌వితో ఆది భగవాన్ సినిమాను కూడా నిర్మించారు. అంబూ పిక్చర్స్ బ్యానరుతో చిత్ర నిర్మాణాలతోపాటు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.