Idream media
Idream media
లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు సోషల్ మీడియాలో గత మ్యాచ్‌ల తాలూకు పలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. అదే కోవలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఆసక్తికరమైన అంశాన్ని తెలియజేశాడు. మిస్టర్ కూల్ ధోనీ ఉత్కంఠభరిత సన్నివేశంలో కూడా తన భావోద్వేగాలను నియంత్రించు కుంటాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కి పాల్పడిన ఘటనలు లేవని చెప్పవచ్చు. అలాంటిది గత ఐపీఎల్ 2019 సీజన్‌లో తన బ్యాటింగ్ గురించి ధోనీ ఎద్దేవా చేసినట్లు తాజాగా బౌలర్ ఇషాంత్ శర్మ ప్రకటించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుక నుంచి చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్, కీపర్ ధోనీ నీకు సిక్స్ కొట్టే సత్తా లేదంటూ స్లెడ్జింగ్‌కి దిగాడని ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. నాటి మాచ్ లో ధోని ఎగతాళి తరువాత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌కి రాగా నేను వరుసగా ఫోర్,సిక్స్ కొట్టాను. నేను సిక్స్ బాదిన తరువాత ధోనీ వైపు చూడగా అతను రవీంద్ర జడేజాకి చివాట్లు పెడుతూ కనిపించాడని లంబూ తెలిపాడు.
కాగా ఐపీఎల్-2011లో ప్రస్తుతం ఉనికిలో లేని ఫ్రాంఛైజీ డెక్కన్ చార్జర్స్ తరపున కోచి టస్కర్స్ కేరళపై ఇషాంత్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కేవలం 3 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌లో ఐదవ టాప్ బౌలింగ్ పర్ఫార్మర్‌గా నిలిచాడు. అలాగే ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 10 సీజన్‌లోనూ ప్లేఆఫ్ దశకు చేరుకొని మూడు సార్లు టోర్నీ ఛాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.