iDreamPost
iDreamPost
ఆ మధ్య రామ్ చరణ్ వినయ విదేయ రామ, ఇటీవల బాలయ్య రూలర్, అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి సినిమాలను చూసి తలబద్దలు కొట్టుకున్నాం కాని కొంచెం తరిచి చూస్తే మనపక్కనే ఉండే అరవోళ్ళు అదే కోలీవుడ్ గ్యాంగ్ వీటికే మాత్రం తీసిపోని రీతిలో కళాఖండాలు తీస్తుంటారు. దానికి సరికొత్త ఉదాహరణ లోకల్ బాయ్. తమిళ్ లో పట్టాస్ పేరుతో రూపొందిన ఈ సినిమాను ఇటీవలే డబ్బింగ్ చేసి ఇక్కడ వదిలారు. రఘువరన్ బిటెక్ తో ఇక్కడా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హీరో కావడంతో యూత్ అంతో ఇంతో దీనికి ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇది తమిళనాడులో గత సంక్రాంతికే రిలీజైంది. కాని ఇక్కడ అప్పటికే తీవ్రమైన పోటీ ఉండటంతో కాస్త ఆలస్యంగా వదిలారు.
కథ చాలా సింపుల్. ఎక్కడో దూరంగా ఓ కుగ్రామంలో ఓ పెద్దాయన(నాజర్)అడిమురై అనే యుద్ధకళను కుర్రాళ్ళకు నేర్పిస్తూ ఉంటాడు. కొడుకు(నవీన్ చంద్ర)కు అది వంటబట్టదు. తండ్రి చేసిన అవమానం తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోతాడు. కాని చురుగ్గా ఉండే విజయేంద్ర(ధనుష్)ఇందులో ఆరితెరిపోతాడు. అదే విద్యను నేర్చుకున్న అమ్మాయి(స్నేహ)ను పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం తర్వాత బాక్సింగ్ నేర్చుకుని వచ్చిన పెద్దాయన కొడుకు హీరోని తన నాన్నని చంపేసి మొత్తం ఆక్రమించుకుంటాడు. తప్పించుకున్న విజయేంద్ర భార్య హత్యానేరం మీద జైలు పాలవుతుంది. అడవిలో తప్పిపోయి వేరొకరికి దొరికిన విజయేంద్ర కొడుకు శక్తి(ఇంకో ధనుష్)దొంగగా పెరిగి పెద్డై శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన తల్లితో కలిసి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇదీ స్టొరీ.
ధనుష్ చాలా గొప్ప వర్స టైల్ యాక్టర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. తమిళం రానివాళ్ళు కూడా వడ చెన్నై, అసురన్ లాంటి సినిమాల్లో ఇతని నటనకు ఫిదా అయిపోయారు. కాని పట్టాస్ లాంటి ఇంత మూస కథను ఎంచుకోవడానికి కారణం మాత్రం అంతుచిక్కదు. ఎక్కడా ఆసక్తి రేపకుండా పాతబడిపోయిన టెంప్లేట్ లో చిన్నపిల్లాడు సైతం ఈజీగా గెస్ చేసే కథాకథనాలతో దర్శకుడు దురై సెంథిల్ కుమార్ ఎక్కడా కొత్తదనం దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. దానికి తోడు ఆడిమురై, కిక్ బాక్సింగ్ అంటూ రొటీన్ ఫార్ములాలోకి వెళ్ళిపోయి ఆసక్తిని చంపేస్తాడు.
ధనుష్, స్నేహ, నాజర్ అంటి సీనియర్ పెర్ఫార్మన్సులు ఉన్నాయి కాబట్టి అంతో ఇంతో తట్టుకోగలిగేలా ఉంది కానీ మొత్తంగా చెప్పాలంటే అరిగిపోయిన మూస మాస్ జానర్ లో ఇలాంటి కథలు ఇప్పటికే లెక్కలేనన్ని చూసిన ప్రేక్షకులకు లోకల్ బాయ్ లో కొత్తగా ఏమి కనిపించదు అనిపించదు. నాన్నను చంపిన విలన్ ను తల్లి సహాయంతో కొడుకు ప్రతీకారం తీర్చుకోవడం జయం మనదేరా, రిక్షావోడు, సింహా లాంటి ఎన్నో సినిమాల లైన్ కే భారతీయుడులోని మర్మకళ టచింగ్ ఇస్తే వచ్చిందే ఈ లోకల్ బాయ్. పోనీ వివేక్ మెర్విన్ ల జంట సంగీతం బాగుందా అంటే అదీ అంతంతే.
సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. స్టార్ ఎంత గొప్పవాడైనా మాస్ కథలను ఎంచుకునేటప్పుడు చేసే పొరపాట్లు కొన్నిసార్లు మూల్యం చెల్లించేలా చేస్తాయి. ఏ హీరో తను ఒప్పుకునే కథ డిజాస్టర్ అవ్వాలని కోరుకోడు. దానికి ధనుష్ కూడా మినహాయింపు కాదు. కాకపోతే మాస్ ప్రేక్షకుడిని తక్కువ అంచనా వేసి ఇది ఆడుతుందిలే అనే ధీమాతో ఇష్టం వచ్చినట్టు చిత్తానికి తీస్తూ పోతే తిరస్కారాలు తప్పవు. పొంగల్ టైంలో వచ్చింది కాబట్టి తమిళ్ లో లోకల్ బాయ్(పట్టాస్)కమర్షియల్ గా కొంత మేర బాగానే రాబట్టుకుంది కానీ ధనుష్ లాంటి ఎప్పుడోసారి కనిపించే హీరోలను ఇలాంటి కథల్లో మనవాళ్ళు భరించడం కష్టమే.