ధమాకా 3 రోజుల కలెక్షన్లు – డబుల్ జాక్ పాట్

మాస్ మహారాజా రవితేజ ధమాకా మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. కంటెంట్ రొటీననే కామెంట్లు రివ్యూలు వచ్చినా మాస్ జనం మాత్రం బాగా కనెక్ట్ అయ్యారని వసూళ్లు చెబుతున్నాయి. ముఖ్యంగా గత నెల రోజులకు పైగా సరైన సినిమా ఏదీ లేకపోవడాన్ని ఈ మూవీ ఫుల్లుగా వాడేసుకుంటోంది. నిన్న ఆదివారం ఒక్క రోజే 5 కోట్లకు పైగా షేర్ రావడం అంటే మాములు విషయం కాదు. బ్లాక్ బస్టర్ క్రాక్ కే థర్డ్ డే ఇంత రాలేదు. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ కి కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటున్నాయి. ఒకటి ధమాకా. రెండోది అవతార్ 2 ది వే అఫ్ వాటర్. హాలీవుడ్ మూవీకి బిసి సెంటర్ల జనాలు అంతగా ఆసక్తి చూపించరు కాబట్టి ఆ ఛాన్స్ ని ధమాకా వాడుకుంటోంది

ఇక వసూళ్ల లెక్కలోకి చూస్తే మూడు రోజులకు గాని వసూలైన మొత్తం 15 కోట్ల 35 లక్షలుగా ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్. ఇది షేర్. అదే గ్రాస్ లెక్కలో చూస్తే 27 కోట్ల 25 లక్షల దాకా తేలుతుంది. గత కొన్నేళ్లలో రవితేజ ఏ సినిమాకు రాని మొత్తం ఇది. ఏరియాల వారీగా చూస్తే నైజామ్ 6 కోట్లు, సీడెడ్ 2 కోట్ల 25 లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 65 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 30 లక్షలు, గుంటూరు 90 లక్షలు, కృష్ణా 80 లక్షలు, నెల్లూరు 42 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 10 లక్షలు, ఓవర్సీస్ 90 లక్షలు మొత్తం కలిపి 15 కోట్లు దాటేసింది. బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో 3 కోట్ల 60 లక్షలు రాబడితే చాలు. హ్యాపీగా లాభాల్లోకి ప్రవేశించవచ్చు. పెద్ద కష్టమూ కాదు

కామెడీ, శ్రీలీల ఆకర్షణ, పాటలు ధమాకాకి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. యూనిట్ ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితం కనిపిస్తోంది. ముఖ్యంగా రిలీజ్ కు ఫిక్స్ చేసుకున్న టైమింగ్ అద్భుతంగా కుదిరింది. ఇదే కారణంగా నిఖిల్ 18 పేజెస్ మిస్ ఫైర్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. మరోవైపు అవతార్ 2కి తెలంగాణలో పెంచిన రేట్లు సాధారణ స్థితికి తేవడంతో మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. మొదటి వారం మిస్ అయినవాళ్లు ఇప్పుడు క్యూ కడుతున్నారు. మళ్ళీ ఇంకో ఇరవై రోజుల దాకా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో ధమాకా మరిన్ని సెన్సషన్లు సృష్టించినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడీ రిజల్ట్ రవితేజకి వాల్తేరు వీరయ్యకు కూడా ప్లస్ అయ్యేలా ఉంది

Show comments