iDreamPost
iDreamPost
ఇద్దరూ ఇష్టపడ్డారు. శృంగారం చేశారు. గర్భం వచ్చింది. ఇలా సమ్మతి శృంగారంతో వచ్చిన గర్భాన్ని 20 వారాలు దాటాక తొలగించుకునే హక్కు అవివాహితలకు లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. 23 వారాలు దాటిన గర్భాన్ని తొలగించుకొనేందుకు అనుమతించాలంటూ, పాతికేళ్ళ అవివాహిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఏకాభిప్రాయంతో జరిగే సెక్స్ ద్వారా వచ్చిన గర్భం Medical Termination of Pregnancy Rules, 2003లోని ఏ క్లాజ్ కిందకీ రాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం గర్భం దాల్చిన 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతిస్తుంది. అయితే అత్యాచారం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో, 24 వారాల వరకు పిండాన్ని గర్భస్రావం చేయించుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుత కేసులో 23 వారాలు దాటింది కాబట్టి, పిటిషనర్ కోరినట్లు వెసులుబాటునివ్వడానికి కోర్టు నిరాకరించింది. అలా చేస్తే రిట్ పిటిషన్ ను స్వీకరించినట్లే అవుతుందని ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ ల డివిజన్ బెంచ్ వివరణ ఇచ్చింది.
ఏకాభిప్రాయ సెక్స్ (consensual sex) జరిగినప్పటికీ, భాగస్వామి పెళ్ళికి నిరాకరిస్తున్నాడు. అందువల్ల తాను బిడ్డకు జన్మనివ్వలేనని, పిటిషనర్ పేర్కొంది. పెళ్ళి కాకుండానే బిడ్డ పుడితే, తనను సమాజం వెలేస్తుందన్నది ఆమె ఆవేదన. దీనిపై స్పందిస్తూ డివిజన్ బెంచ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిడ్డను చంపుకునే బదులు దత్తత ఇవ్వొచ్చు కదా అని సూచించింది. దత్తత కోసం ఎంతో మంది క్యూ కడుతున్న విషయాన్ని గుర్తు చేసింది. “బిడ్డను పెంచమని చెప్పడం లేదు, ప్రభుత్వమే అంతా చూసుకుంటుంది, మేము కూడా కొంత ఖర్చు భరిస్తాం” అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ పిటిషన్ ను డివిజన్ బెంచ్ ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచింది. ఆగస్టు 26లోపు తమ స్పందనను ఫైల్ చేయాలంటూ ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నోటీసులు జారీ చేసింది.