iDreamPost
android-app
ios-app

కొన్ని రోజుల్లో పెళ్లి.. వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబం మొత్తం..

  • Published Nov 07, 2024 | 11:23 AM Updated Updated Nov 07, 2024 | 11:37 AM

వడ్డీ వ్యాపారి వేధింపులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అప్పుల కారణంగా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వడ్డీ వ్యాపారి వేధింపులు ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అప్పుల కారణంగా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.

కొన్ని రోజుల్లో పెళ్లి.. వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబం మొత్తం..

తల్లిదండ్రులు ఎవరైనా తమ కూతురుకు వైభవంగా పెళ్లి చేయాలని భావిస్తుంటారు. కుమార్తె వివాహం కోసం పైసా పైసా కూడబెడుతుంటారు. కుమార్తెకు పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించాలని కలలుకంటుంటారు. అందరిలాగే ఆ తల్లిదండ్రులు కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురుకు వివాహం జరిపించాలనుకున్నారు. ఓ మంచి సంబంధం చూసి ఓ అయ్య చేతిలో పెట్టాలనుకున్నారు. ఇటీవలె కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. గతంలో తీసుకున్న అప్పులు వారి పాలిట శాపంగా మారాయి. వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఒత్తిళ్లు తట్టుకోలేక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల వేధింపులు ఓ చిరువ్యాపారి కుటుంబాన్ని చిదిమేశాయి. ఈ ఘటనలో చిరువ్యాపారి మృతి చెందగా కొన్ని రోజుల్లో పెళ్లి కావాల్సిన కుమార్తె గల్లంతైంది. భార్య ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా బాసర వద్ద చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు (54) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నిజామాబాద్ కు వలస వచ్చారు. తన భార్య అనూరాధ, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నారు. స్థానికంగా పాన్ షాప్ నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే కొంతకాలంగా దుకాణం సక్రమంగా నడవకపోవడంతో ఆదాయం పడిపోయింది. దీంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. వేరే ఉపాధి మార్గం లేక ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఇక చేసేదేం లేక స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద వేణు రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. కాగా తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ ఇటీవల అప్పులిచ్చినవారు వేణు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేశారు. అప్పులు తీరుస్తానని కాస్త టైమ్ కావాలని అడిగినా వడ్డీ వ్యాపారులు వినలేదు. తన చిన్నకుమార్తె పూర్ణిమ (25)కు పెళ్లిచూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి సమయం ఇవ్వాలని వేడుకున్నా వారు వినిపించుకోలేదు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేకపోయారు.

దీంతో మనస్తాపానికి గురైన వేణు, తన భార్య, కుమార్తెతో కలిసి బాసరకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. అనూరాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాలఘాట్‌ వరకు కొట్టుకొచ్చారు. ఇది గమనించిన స్థానిక గంగపుత్రులు, భక్తులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ముథోల్‌ సీఐ మల్లేశ్, బాసర, ముథోల్‌ ఎస్సైలు గణేశ్, సాయికిరణ్ అక్కడికి చేరుకొని అనూరాధతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆమె భర్త, కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది.

పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఇక్కడ మరో విషాద ఘటన ఏంటంటే? వేణు పెద్ద కుమార్తెకు వివాహం కాగా నాలుగేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు చిన్న కుమార్తెకు పెళ్లి కుదరగా వడ్డీ వ్యాపారుల వేధింపులతో వేణు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరి వడ్డీ వ్యాపారుల వేధింపులతో కుటుంబంలో విషాదం అలుముకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.