iDreamPost
iDreamPost
ఏ ముహూర్తంలో బాహుబలి ఒప్పుకున్నాడో కానీ ప్రభాస్ అందరికీ టార్గెట్ అయిపోయాడు. డిజాస్టర్ అనిపించుకున్న సాహో నార్త్ లో మంచి వసూళ్లు రాబట్టింది. అసలే మాత్రం పాజిటివ్ టాక్ రాని రాధే శ్యామ్ కు వచ్చిన ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఆది పురుష్ వంతు వచ్చింది. మోషన్ క్యాచర్ టెక్నాలజీతో రియల్ కం యానిమేషన్ పద్ధతిలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ మీద సుమారు అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టారనే వార్త ఇప్పటికే ఎందరో నిర్మాతలకు కునుకు రానివ్వడం లేదు. జనవరి 12 ఇది విడుదలయ్యే సమయానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకేమేం జరగనున్నాయో ఉహించడం కష్టం.
దానికి తోడు టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్, రాముడు రావణుడు గెటప్స్ మీద వచ్చిన ఫిర్యాదులు ఏకంగా కోర్టు కేసుల దాకా వెళ్లాయి. ఢిల్లీకి చెందిన లాయర్ రాజ్ గౌరవ్ ఏకంగా దీన్ని బ్యాన్ చేయాలని హై కోర్టులో కేసు వేయడం వివాదాన్ని మరింత పెంచింది. ఇంకో తొంబై రోజుల్లో విడుదల పెట్టుకుని ఇప్పుడీ కాంట్రావర్సీలు రేగడం చూస్తుంటే కావాలని చేస్తున్నారా లేక ఇంకేదైనా ఉద్దేశం ఉందేమో అంతు చిక్కడం లేదు. కేవలం నిమిషం టీజర్ నుంచే ఇన్ని గొడవలు వస్తే త్వరలో రిలీజయ్యే ట్రైలర్ తో ఎన్ని రాబోతున్నాయో. ఇక్కడితో ఇవి ఆగుతాయనుకుంటే అమాయకత్వమే. ధార్మిక సంఘాలు రంగంలోకి దిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదంతా ప్రభాస్ స్టార్ డంని చూసి ఓర్వలేనితనమా లేక బయటికి కనిపించనివ్వని మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. వీటి సంగతి ఎలా ఉన్నా పవిత్ర రామాయణ గాథను ఆధారంగా తీసుకుని రూపొందిన ఆది పురుష్ మీద మాములు అంచనాలు లేవు. ఒకవేళ కంటెంట్ కనక కరెక్ట్ గా క్లిక్ అయితే వేల కోట్ల వర్షం వసూళ్ల రూపంలో కురవడం ఖాయం. కామెంట్లు ఎన్ని ఉన్నా దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఇప్పటిదాకా వెండితెరపై చూడని సరికొత్త అనుభూతినిస్తానని హామీ ఇస్తున్నాడు. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడంటే విషయమున్నట్టేగా కానీ నిర్మాతలు కొత్తగా వేరొక టీమ్ తో విఎఫ్ఎక్స్ పనులను పునఃసమీక్షిస్తున్నట్టు తెలిసింది. అదే జరిగి మంచి అవుట్ ఫుట్ వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది