iDreamPost
android-app
ios-app

షూటింగులకు కొత్త చిక్కులు

  • Published Jun 17, 2020 | 5:57 AM Updated Updated Jun 17, 2020 | 5:57 AM
షూటింగులకు కొత్త చిక్కులు

ప్రభుత్వమైతే అనుమతులు ఇచ్చింది కానీ ఇంకా సినిమా షూటింగుల సందడి మొదలుకానే లేదు. టీవీ సీరియల్స్ మాత్రం ఎంచక్కా తమ పని తాము చేసుకుంటూ జూన్ 22 నుంచి రాబోతున్నామని ఏకంగా యాడ్స్ కూడా ఇచ్చేశాయి. ఎప్పటికప్పుడు నాన్ స్టాప్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ రోజులో అధిక శాతం గంటలు వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్లు తీసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాయి . పరిస్థితి ఎప్పుడు ఎలా ఉండబోతోందో అర్థం కావడం లేదు కాబట్టి మెరుపు వేగంతో యూనిట్లు యమా బిజీగా ఉన్నాయి. బుల్లితెర సందడి ఈ రేంజ్ లో ఉండగా టాలీవుడ్ లో మాత్రం ఎలాంటి చడీ చప్పుడు లేదు.

రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న క్రష్ మొదలుపెట్టారు కాని అది చాలా లో బడ్జెట్ మూవీ. హీరో హీరొయిన్లు కూడా కొత్తవాళ్ళే. ఓటిటి రిలీజ్ అనే టాక్ వినిపిస్తోంది కనక కనీసం సెన్సార్ కూడా అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ అన్నారు కాని దానికి సంబంధించిన ఎలాంటి సమాచారం పక్కాగా తెలియడం లేదు. ఇక మనవాళ్ళ విషయానికి వస్తే జాగ్రత్తల కోసం ఆర్థికంగా అదనపు భారం అయినా సరే కొందరు నిర్మాతలు షూటింగులకు రెడీ అవుతున్నారు. కాని నటీనటులే అంత సుముఖంగా లేరని ఫిలిం నగర్ టాక్. ఇంకొన్ని రోజులు వేచి చూద్దామని తొందరపడటం ఎందుకనే ధోరణిలో చాలా మంది సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ఆరోగ్యం విషయంలో ఎవరి భయం వాళ్ళది. దీన్ని తప్పు అనలేం. అలా అని ప్రొడ్యూసర్లు ఫోర్సు కూడా చేయలేరు.

హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్న తరుణంలో ఎందుకు లేనిపోని రిస్క్ అనే ఆలోచనతో వేచి చూస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు అన్ని మీటింగులు పెట్టుకుని అన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిస్తే తీరా దాని వల్ల టీవీ చానళ్ళకు లాభం కలుగుతోంది. ఇంకో నెల లేదా రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్లు వయసు దృష్ట్యా కొంచెం వెయిట్ చేయడమే బెటర్ అని ఆలోచిస్తున్నారట. ఏ పరిణామాలు ఎలా ఉన్నా మధ్యలో నలిగిపోతోంది మాత్రం నిర్మాతలే. వీళ్ళ కష్టాలు ఇలా ఉండగా రిలీజులకు సిద్ధంగా చేతుల్లో ఫస్ట్ కాపీలు పెట్టుకున్న ప్రొడ్యూసర్ల యాతన ఇంకోరకంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నటీనటుల జాగ్రత్త షూటింగులకు ఇంకొన్నాళ్ళు బ్రేక్ వేయిస్తోంది. తమిళంలో అజిత్ లాంటి స్టార్లు నేరుగా తమ నిర్మాతలకే వ్యాక్సిన్ వచ్చే దాకా నో షూటింగ్స్ అంటున్నారట. కరోనా పుణ్యమాని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.