iDreamPost
iDreamPost
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సందడి కనిపిస్తుంటే.. తెలుగుదేశం మాత్రం దీన్ని వక్రీకరించి చెబుతోంది. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుదోవ పట్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో జరగనున్న ఓ సభ ద్వారా ప్రజలకు నిజానిజాలు చెప్పనుంది వైసీపీ.
రాజధాని వద్దు.. సాగునీటి ప్రాజెక్టులే ముద్దు.. అంటూ అనంతపురంలో నేడు బహిరంగ సభ నిర్వహించేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించేందుకు వైసీపీ నేతలు, మేధావులు, రాజకీయ పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని ముఖ్యం కాదని.. సాగునీటి ప్రాజెక్టులు ఉంటేనే అది సాధ్యమని ప్రజలకు వివరించనున్నారు. ఇన్నేళ్లకు ప్రజా ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ కరువు ప్రాంతమైన రాయలసీమకు ఏం చేస్తోందో చెప్పనున్నారు.
రాష్ట్రంలో రాజధాని అమరావతే ఉండాలంటూ బిక్షాటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనడుస్తోంది. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచి లక్షల మంది రైతులు వలసలు వెళ్లడం మనమంతా పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటాం. అయితే సరిగ్గా ఇదే అంశంపై వైసీపీ చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధమవుతోంది.
కరువున్న రాయలసీమలో వలసలు ఉన్న సమయంలో, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో జోలె పట్టి బిక్షాటన చేయాలని చంద్రబాబుకు అప్పుడు ఎందుకు అనిపించలేదని ప్రశ్నిస్తున్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ తన స్వార్థం గురించే చంద్రబాబు ఆలోచిస్తారన్నది ప్రజలకు తెలుసని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం తన వాళ్లకు నష్టం జరుగుతుందనే ఇప్పుడు బిక్షాటన పేరుతో రాద్దాంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనంతపురం సాక్షిగా ప్రజలకు తెలియజెప్పనున్నారు.
ప్రపంచ అత్యుత్తమ రాజధానిగా చెబుతున్న అమరావతికి కేవలం రూ. 5వేల కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు కేటాయించాడన్న అంశం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అమరావతిని నిజంగా పూర్తి చేయాలనుకుంటే ఇప్పటికే వేరే స్థాయిలో అభివృద్ధి చేసేవారు. కేవలం తన స్వార్థం కోసం ఎలా కావాలంటే అలా రాజధానిని మార్చుకునేందుకు చంద్రబాబు కష్టపడ్డాడు. రాయలసీమ రైతాంగం పరిస్థితిపై అప్పట్లోనే పూర్తి స్థాయి శ్రద్ద కనిబరిచింటే ఇప్పుడు రైతాంగం ఇన్ని ఇబ్బందులు పడి ఉండేది కాదన్నది అందరకి తెలసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల కాలంలోనే రాయలసీమలో కరువు లేకుండా చేసేందుకు ప్రాజెక్టుల పై ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలసిందే. తాను పాదయాత్ర చేసిన సయంలోనే జగన్ సాగునీటి విషయంలో రైతులకు ప్రత్యేకమైన హామీలు ఇచ్చి ఆ విధంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమలో రాజధాని కంటే సాగునీటి ప్రాజెక్టులు ఎంత అవసరమో చెప్పి.. ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వివరించేందుకు అనంతపురం బహిరంగ సభ సిద్ధమవుతోంది.