iDreamPost
android-app
ios-app

దర్బార్ విశేషాలు

దర్బార్  విశేషాలు

ప్ర‌సాద్ ఐమాక్స్ ద‌గ్గ‌ర ఉద‌యం 8.30కే జాత‌ర క‌నిపించింది. ర‌జ‌నీకాంత్ స్టామినా అది. ర‌జ‌నీకి, ముర‌గ‌దాస్‌కి వ‌రుస ప్లాప్‌లున్నా, ప్రేక్ష‌కుల్లో క్రేజ్ త‌గ్గ‌లేదు. ఐతే అంచ‌నాల‌కు అనుగుణంగా ద‌ర్బార్ నిల‌బ‌డ‌లేదు.

ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌గా ఉన్న ఒక పోలీస్ ఆఫీస‌ర్‌, ముంబ‌య్ డ్ర‌గ్ మాఫియా, ఈ క‌థా నేప‌థ్యంలో ర‌జ‌నీ హీరోగా ఉంటే ఆ కిక్కే వేరు. అయితే డైరెక్ట‌ర్ మురగ‌దాస్ ఫ‌స్టాఫ్‌లో కిక్ ఎక్కించే, సెకండాఫ్‌లో ఆ కిక్‌ను దించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ర‌జ‌నీకి హిట్ ప‌డింద‌నే ఆశ క‌ల్పించిన‌ట్టే క‌ల్పించి , అభిమానుల్ని నిరాశ ప‌రిచాడు.

మామూలుగానే సినిమా క‌థ‌లో లాజిక్‌లు ఉండ‌వు. ర‌జ‌నీ హీరోగా ఉంటే మ్యాజిక్కే త‌ప్ప లాజిక్‌కి ఆస్కారం లేదు. ముంబ‌య్‌లో అరుణాచ‌లం అనే పోలీస్ క‌మిష‌న‌ర్ వ‌రుస ఎన్‌కౌంట‌ర్‌లు చేస్తున్నాడ‌నే దృశ్యాల‌తో సినిమా Open అవుతుంది. ఒక రౌడీ ద‌మ్ముంటే త‌న‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌మ‌ని ఛాలెంజ్ చేస్తూ వీడియో పెడ‌తాడు. వెళ్లి ఒక క్ల‌బ్‌లో దాక్కుంటాడు.

అప్పుడు హీరో Entry పెద్ద ఫైట్‌, అభిమానులు ఎగిరి గంతులేశారు. త‌ర్వాత హ్యూమ‌న్ రైట్స్ స‌భ్యులు , ఎన్‌కౌంట‌ర్‌ని విచారించ‌డానికి వ‌స్తే వాళ్ల మీద కూడా గ‌న్ పెట్టి హీరో సంత‌కాలు చేయిస్తాడు. ఇక్క‌డ ఫ్లాష్ బ్యాక్‌.

హీరోకి ఒక కూతురు (నివేదాథామ‌స్‌) ఒక ప్ర‌త్యేక‌మైన ప‌నిమీద అత‌న్ని ముంబ‌య్ ర‌ప్పిస్తారు. 25 ఏళ్ల క్రితం హ‌రిచోప్రా (సునీల్‌షెట్టి) ముంబ‌య్ పోలీసుల‌ని స‌జీవ ద‌హ‌నం చేయ‌డం వ‌ల్ల , పోలీసుల్లో ఏర్ప‌డిన భ‌యాన్ని పోగొట్ట‌డానికి ర‌ప్పిస్తారు.

హీరో వ‌చ్చీరాగానే డ్ర‌గ్ మాఫియాని అణిచేస్తాడు. అమ్మాయిల‌ని ర‌క్షిస్తాడు. ఈ క్ర‌మంలో ఒక డ‌బ్బున్న వాడి కొడుకుని అరెస్ట్ చేస్తాడు. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా లెక్క చేయ‌కుండా జైల్లో పెడ‌తాడు. కానీ జైలు నుంచి వాడు త‌ప్పించుకుని, త‌న‌కి బ‌దులుగా ఇంకొక‌డిని జైల్లో ఉంచుతాడు. ఇది తెలిసిన హీరో అస‌లు నేర‌స్తుడిని కాల్చి చంపుతాడు. అయితే ఆ కుర్రాడు ఎవ‌రో కాదు విల‌న్ హ‌రిచోప్రా కొడుకే అని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో హీరో త‌న కూతురిని పోగొట్టుకుంటాడు. ఏం జ‌రిగింద‌నేది సెకండాఫ్‌.

ఫ‌స్టాఫ్ కూడా ప‌ర‌మ రొటీన్ క‌థే అయినా స్క్రీన్ ప్లే స్పీడ్‌గా ఉండ‌డం , ర‌జ‌నీ డైలాగ్స్, స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ అన్నీ మ‌న‌ల్ని సీట్లో కూర్చో పెడ‌తాయి. నివేదా థామ‌స్ అద్భుత‌మైన న‌టి కావ‌డంతో తండ్రీకూతుళ్ల ఎమోష‌న్ పండుతుంది. తండ్రికి పెళ్లి చేయ‌కుండా , తాను పెళ్లి చేసుకోన‌ని ప‌ట్టుప‌ట్టిన కూతురు వ‌ల్ల న‌య‌న‌తార‌ను ప్రేమించ‌డానికి హీరో ప్రిపేర్ అవుతాడు. ఈ సీన్స్‌లో కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. నిజానికి న‌య‌న‌తార శుద్ధ దండ‌గ‌. న‌టించ‌డానికి అవ‌కాశ‌మే లేని పాత్ర‌ను ఒప్పుకుందంటే ర‌జ‌నీకి జోడి కావ‌డ‌మే కార‌ణం కావ‌చ్చు. ఈ రొమాన్స్‌లో యోగిబాబు కామెడీ డైలాగ్‌లు కూడా బాగానే పేలాయి.

Rajani Is Back అని చాయ్ తాగి , పాప్‌కార్న్ బ‌కెట్ల‌తో ఆనందంగా సెకండాఫ్‌లోకి ఎంట‌ర్ అయిన ప్రేక్ష‌కుల నెత్తిన బ‌కెట్ నీళ్లు కుమ్మ‌రించాడు ముర‌గ‌దాస్‌. మురిగిపోయిన విల‌నిజం, క్లైమాక్స్‌తో చావ‌బాదాడు.

సెకండాఫ్‌లో క‌థ లేక‌పోవ‌డంతో చేతులెత్తేశాడు. ఏం జ‌రుగుతుందో ముందే ఆడియ‌న్స్‌కి ఫ‌స్టాఫ్‌లోనే తెలిసిపోయింది. హీరో కూతురు చ‌నిపోతుంద‌ని తెలుసు. త‌న కొడుకుని చంపారు కాబ‌ట్టి విల‌న్ ఈ ప‌ని చేస్తాడ‌ని తెలుసు. విల‌న్‌ని హీరో చంపుతాడ‌ని కూడా తెలుసు. ఎందుకంటే ఫ‌స్టాఫ్‌లోనే ఇది క్లియ‌ర్ అయిపోయింది.

ముర‌గ‌దాస్ లాంటి డైరెక్ట‌ర్ చేయాల్సిన ప‌ని ఏంటంటే హీరో కూతురు ఎలా చ‌నిపోయింది, విల‌న్‌ని ఏ ర‌కంగా ప‌ట్టుకున్నాడు, ఈ రెండు పాయింట్లు కొత్త‌గా ఆలోచించి ఉంటే సినిమా నిల‌బ‌డేది. అదేమీ లేక‌పోగా , ర‌జ‌నీ ఎన‌ర్జీ కూడా పోనూపోనూ త‌గ్గిపోయేలా చేశాడు.

యాక్సిడెంట్‌లో ర‌జ‌నీకి గాయాలు, శ‌క్తి లేదు కాబ‌ట్టి వాలెంట‌రీ రిటైర్మెంట్‌, శ‌క్తి పుంజుకోడానికి ఎక్స‌ర‌సైజ్‌లు, విల‌న్‌ని పోలీసుల్ని వ‌రుస పెట్టి చంప‌డం, ర‌జ‌నీ రౌడీల‌ను కొడితే, వాళ్లు ఒకేసారి 10 మంది గాల్లోకి లేచినా (ఇది గ్రావిటీ సిద్ధాంతానికి వ్య‌తిరేక‌మైనా సరే) సైన్స్ స్టూడెంట్స్ కూడా లాజిక్‌లు అడ‌గ‌రు. అయితే ఆ ప‌ని చేయ‌కుండా ముర‌గ‌దాస్ ప్రేక్ష‌కుల్ని క‌ర్ర‌ల‌తో బాద‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు. దాంతో అభిమానులు ఈలలు వేసే శ‌క్తి కూడా లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తారు.

దాదాపు 70 ఏళ్ల వ‌య‌స్సులో కూడా అలా ఉన్నాడంటే, ఆయ‌న గొప్ప‌త‌నం, సంతోష్‌శివ‌న్ కెమ‌రా ప‌నిత‌నం, మేక‌ప్ ప్ర‌తిభ కార‌ణాలు. పాట‌లు బాలేవు కానీ, ర‌జ‌నీ స్టెప్పులు హైలెట్‌. కొంచెం ఓపిక చేసుకుంటే ఒక‌సారి చూడొచ్చు. డైలాగ్‌లో గ్రాంథికంగా త‌గిలాయంటే డ‌బ్బింగ్ లోప‌మే. అంతే కాదు ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌కి నిర్మాణ ఉత్ప‌త్తి అని టైటిల్స్‌లో అనువాదం చేశారంటే , తెలుగు బాగా తెలిసిన ఎవ‌రో మ‌హానుభావులే ప‌నిచేసిన‌ట్టున్నారు.

ఫ‌స్టాఫ్‌ స్పీడ్‌…సెకండాఫ్ లాగుడు (రేటింగ్ః 2.5/5)